logo

భగీరథ జలం.. అందనంత దూరం

ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లిస్తున్నామని పాలకులు చెబుతున్నా ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్‌పేటకు శుద్ధ జలాలు అందని ద్రాక్షగానే మారాయి.

Published : 10 Jun 2023 04:51 IST

పంచాయతీలపై విద్యుత్తు బిల్లుల భారం

చిత్రంలో తాగునీటి కుళాయి వద్ద నిల్చున్నది బత్తిని సరళ-వెంకటేష్‌. ఊరు కమ్మర్‌ఖాన్‌పేట. వీరి ఇంటి వద్దకు పైపులైన్లు వేసి నల్లాలు బిగించినా తాగునీరు రావడం లేదు. దీంతో చేదబావి నీళ్లనే తాగుతున్నామని వాపోతున్నారు. ఈ ఒక్క కుటుంబమే కాదు. ఊళ్లో ఎవరికీ మిషన్‌ భగీరథ నీళ్లు అందడం లేదు. దీంతో కుళాయిలు అలంకార ప్రాయంగా మారాయి.

న్యూస్‌టుడే, ధర్మారం : ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లిస్తున్నామని పాలకులు చెబుతున్నా ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్‌పేటకు శుద్ధ జలాలు అందని ద్రాక్షగానే మారాయి. 451 కుటుంబాలున్న ఈ గ్రామ జనాభా 1,679. ధర్మారంలోని భగీరథ ప్లాంటులో శుద్ధి చేసిన జలాలు ఇక్కడకు చేరాల్సి ఉంది. గ్రామంలో అంతర్గత పైపులైన్లు వేసినా, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసినా, పాఠశాల పక్కనే గుట్టపై ఉన్న ట్యాంకుకు పైపులైనును కలిపినా నీళ్లు మాత్రం రావడం లేదు. దీంతో స్థానికంగా వున్న బావి, బోరు ఆధారంగా పాత పైపులైన్ల ఆధారంగానే తాగు నీరందిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా రూ.51 వేల వరకు పంచాయతీ విద్యుత్తు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. తమ గ్రామానికి శుద్ధ జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్య తీరలేదని సర్పంచి గుజ్జుల రమ పేర్కొన్నారు.

ఒక్క ఊరిలోనే కాదు..

* బొమ్మారెడ్డిపల్లిలోనూ సగం గ్రామానికి తాగు నీరందడం లేదు. ఇక్కడ రెండు ట్యాంకులుండగా ఒక దాంట్లోకే నీళ్లు చేరుతున్నాయి. మరో ట్యాంకు ఎత్తుగా ఉండటంతో ఎక్కడం లేదు. దీంతో సగం గ్రామానికి మాత్రమే సరఫరా అవుతున్నాయి.

* బూస్టర్‌ పంపు ఏర్పాటు చేసి ట్యాంకులోకి నీళ్లు చేర్చేందుకు యత్నించారు. కానీ పంపును ఆన్‌ చేస్తే మొదటి ట్యాంకులోకి చేరడం లేదు. ఈ విషయమై సర్పంచి ప్రేమలత పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించలేదు. దీంతో ఈ ఊరి ప్రజలు ఏళ్ల తరబడి బావులనే నమ్ముకున్నారు. నెలకు రూ.45 వేల వరకు విద్యుత్తు బిల్లు వస్తోంది.

* బొట్లవనపర్తి ఎస్సీ కాలనీకి సైతం శుద్ధ జలాలు అందడం లేదు. ఓ గేట్‌వాల్వు మరమ్మతుకు నోచుకోవడం లేదు. పంచాయతీ ద్వారా వాల్వు మరమ్మతుకు పాలకవర్గం సముఖంగా ఉన్నా మిషన్‌ భగీరథ పైపులైన్ల మరమ్మతు అధికారులే చేపట్టాల్సి ఉండటంతో మిన్నకుంటున్నామని సర్పంచి ప్రమీల తెలిపారు.

* దొంగతుర్తి పాఠశాల వద్ద ఎర్రబోరుపై ఉన్న ట్యాంకులోకి అరకొరగా నీళ్లు వస్తున్నాయి. దీంతో స్థానిక బావి నీటినీ ట్యాంకులోకి తరలించి గ్రామానికి సరఫరా చేస్తున్నారు. చాలా గ్రామాల్లో మిషన్‌ భగీరథ, స్థానిక వనరుల నీళ్లను కలిపి సరఫరా చేస్తున్నారు. దీంతో చాలా మంది ఈ నీటిని తాగేందుకు అయిష్టత కనబరుస్తున్నారు.

అధికారులేమంటున్నారంటే..

బొట్లవనపర్తిలో గేట్‌వాల్వు బిగింపు పనులను పంచాయతీ ఆధ్వర్యంలో చేపడితే రికార్డు చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంట్రా డీఈఈ రాజ్‌కుమార్‌ తెలిపారు.

కమ్మర్‌ఖాన్‌పేటకు తాగునీరందించే పైపులైనులో సమస్య ఉందని, వీలైనంత త్వరగా మరమ్మతు చేస్తామని గ్రిడ్‌ ఏఈ అజీముద్దీన్‌ వివరించారు. బొమ్మారెడ్డిపల్లిలో నీళ్లు చేరని ట్యాంకు వద్ద ఇదివరకే ఉన్న సంపుకు పంపుసెట్టు ఏర్పాటు చేసి ట్యాంకులోకి నీటిని ఎత్తిపోస్తామన్నారు.

గ్రామంలోని నీటి ట్యాంకు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని