logo

సేవలు మెరుగైతేనే పూర్తి స్థాయి ధ్రువీకరణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్రం నిర్వహించిన ‘లక్ష్య’, ‘ముస్కాన్‌’ పోటీల్లో గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రికి ఆశించిన మేరకు మార్కులు రాకపోగా శరతులతో కూడిన

Published : 10 Jun 2023 04:51 IST

ముస్కాన్‌ పోటీలో మార్కులు అంతంతే

గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలోని పిల్లల వార్డు

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం : ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్రం నిర్వహించిన ‘లక్ష్య’, ‘ముస్కాన్‌’ పోటీల్లో గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రికి ఆశించిన మేరకు మార్కులు రాకపోగా శరతులతో కూడిన ధ్రువీకరణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రసూతి విభాగంలో వైద్య సేవల తీరును ధ్రువీకరించేందుకు ‘లక్ష్య’ పిల్లల వైద్య సేవల తీరుపై ‘ముస్కాన్‌’ పోటీల్లో జాతీయ ఆరోగ్య మిషన్‌ మార్గదర్శకాల ప్రకారంగా సేవలు లేకపోవడంతో మార్కులు తక్కువ వచ్చాయి. 2019లో నిర్వహించిన లక్ష్య పోటీల్లో గోదావరిఖని ఆసుపత్రి 88 శాతం మార్కులతో ధ్రువీకరణకు ఎంపిక కాగా ఇటీవల నిర్వహించిన పోటీల్లో కేవలం 76 శాతం మార్కులతో శరతులతో కూడిన ధ్రువీకరణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో మొదటి సారిగా నిర్వహించిన ముస్కాన్‌ పోటీల్లోనూ గోదావరిఖని ఆసుపత్రి 83శాతం మార్కులతో శరతులతో కూడిన ధ్రువీకరణకు ఎంపిక కావాల్సి వచ్చింది. ఈ కారణంగా ఒకే సంవత్సరం ప్రయోజనం చేకూరనుంది. వచ్చే సంవత్సరం నాటికైనా ఈ లోపాలను సవరించుకొని అత్యుత్తమ మార్కులు సాధిస్తే పూర్తిస్థాయిలో మూడేళ్ల పాటు ఆర్థిక ప్రయోజనాలు అందుకునే అవకాశముంది.

ప్రసూతి సేవల్లో వెనుకబాటు

ప్రసూతి సేవలకు సంబంధించిన ‘లక్ష్య’లో సహజ ప్రసవాల గదికి 76 శాతం, ఆపరేషన్‌ థియేటరుకు 77 శాతం మార్కులు వచ్చాయి. ప్రధానంగా వ్యాధి నిర్ధారణ, అంటువ్యాధుల నివారణ, నాణ్యత పెంపు, రక్తనిధి కేంద్రం నిర్వహణ తదితర విభాగాల్లో 50శాతం మార్కులే రావడంతో ఆయా విభాగాల్లో సేవలను మెరుగుపరచుకోవాల్సి ఉంది. వీటితో పాటు ఆసుపత్రిని పరిశీలించిన ‘లక్ష్య’ ప్రతినిధులు పలు సూచనలు చేశారు. ప్రధానంగా తల్లి, బిడ్డలకు ట్యాగ్స్‌ పెట్టడం లేదు. సహజ ప్రసవాల గదిలో మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన నర్సింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలి. రికార్డులను పక్కాగా నిర్వహించాలి. ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. గర్భిణి, బాలింత పడకలకు సమీపాన శిక్షణ పొందిన సహాయకులను ఏర్పాటు చేయాలి. అత్యవసర వేళల్లో స్పందించాల్సిన అంశాలపై అవగాహన కల్పించాలి.

పిల్లల వైద్యంలో  ప్రగతి

ఆసుపత్రిలోని 12 సంవత్సరాల లోపు పిల్లలకు అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగు పరచుకోవాల్సి ఉంది. ఇటీవల చేపట్టిన ‘ముస్కాన్‌’ పరిశీలనలో 83 శాతం మార్కులు వచ్చినప్పటికీ కొన్ని విభాగాల్లో లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో శరతులతో కూడిన ధ్రువీకరణ ఇచ్చారు. పిల్లల ఓపీ విభాగంలో 79 శాతం, ఇన్‌పేషెంటు విభాగంలో 90 శాతం, నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి 80 శాతం మార్కులు కేటాయించారు. నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు 72 శాతం, సదుపాయాల కల్పనకు 63 శాతం, ఔషధాల నిర్వహణకు 66 శాతం, సిబ్బంది పనితీరు మెరుగుదలలో 56 శాతం మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు పిల్లల వార్డుల్లో సేవలందించే వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంది. తల్లీబిడ్డలకు సంబంధించి ఆరోగ్య కార్డులను నిర్వహించాలి. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల ప్రతిస్పందనపై విచారణ చేపట్టాలి. రోగులు, ఉద్యోగుల సంతృప్తి విభాగంలో కేవలం 56 శాతం మార్కులు రాగా నాణ్యతా ప్రమాణాల పరిశీలన విభాగంలో 58 మార్కులే వచ్చాయి. పిల్లల వైద్యంపై ఎప్పటికప్పుడు సమీక్షల నిర్వహణ, అంతర్గత పరిశీలనలో 50 శాతం మార్కులు వచ్చాయి. రిస్క్‌ మేనేజ్‌మెంట్లో 50శాతం మార్కులే వచ్చాయి. శిశు మరణాల రేటు తగ్గింపు, న్యుమోనియా, డయేరియా వ్యాధుల నివారణలో జాతీయ ఆరోగ్య మిషన్‌ సూచించిన లక్ష్యాలను చేరుకోలేకపోయారు. ఇప్పటికైనా ఆయా విభాగాల్లో సేవలు మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని