logo

దివ్యాంగులకు శుభవార్త

దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. శుక్రవారం మంచిర్యాలలో జరిగిన సభలో వారికి వచ్చే నెల నుంచి రూ.4,016 పింఛన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Published : 10 Jun 2023 04:51 IST

పింఛన్‌ పెంచుతున్నట్లు సీఎం ప్రకటన
జిల్లా వ్యాప్తంగా 23,710 మందికి లబ్ధి

న్యూస్‌టుడే,కరీంనగర్‌ సంక్షేమ విభాగం : దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. శుక్రవారం మంచిర్యాలలో జరిగిన సభలో వారికి వచ్చే నెల నుంచి రూ.4,016 పింఛన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి నెల పింఛన్‌ రూ.3016 ఇస్తున్నారు. వచ్చే నెల జులై నుంచి పెంచి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఇద్దరు దివ్యాంగులుంటే ప్రతి నెల వారికి రూ.8,032 వస్తుంది. వారికి ఇళ్లు గడవడానికి కొంత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రకటనతో కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 23,710 మందికి ప్రయోజనం చేకూరనుంది.

రూ.9.75 కోట్లు...

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 23,710 మంది దివ్యాంగులున్నారు. వీరికి ప్రతి నెల పింఛన్‌ కోసం ప్రభుత్వం రూ.7.15 కోట్లు కేటాయిస్తుంది. వచ్చే నెల నుంచి మరో పదకొండు వందల రూపాయలు పెరుగుతుండడంతో అదనంగా మొత్తం రెండు కోట్ల అరవై లక్షల ఎనభై ఒక వేల రూపాయలు జిల్లాకు కేటాయించనుంది. మొత్తం ప్రతి నెల జిల్లాకు రూ.9.75 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

పెరగనున్న దరఖాస్తులు?

దివ్యాంగులకు ప్రతి నెల రూ.3016 పింఛన్‌ తోపాటు బస్సు, రైలు ప్రయాణాల్లో రాయితీ సౌకర్యముంది. ప్రభుత్వం నుంచి వివిధ రకాల రాయితీ రుణాలు వస్తుండడంతో చాలామంది సదరం ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 40 శాతంపై ఉంటేనే పింఛన్‌తోపాటు అన్నీ రకాల రాయితీలు వర్తిస్తాయి. చాలామంది అనర్హులు సైతం తమకు ధ్రువీకరణ పత్రం కావాలని సదరం శిబిరానికి వస్తున్నారు. వారిలో అన్నీ రకాల విభాగాలలో కలిపి అర్హులను పరిశీలిస్తే సగటున మొత్తం ఆసుపత్రికి వచ్చిన వారిలో 200 మందిలో కేవలం 60 నుంచి 70 లోపే అర్హులు ఉంటున్నట్లు వైద్యులు చెబున్నారు. మిగతా వారంత ప్రభుత్వ రాయితీ రుణాలు, బస్సు, రైలు పాస్‌ల కోసం వస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం రూ.4,016 పింఛన్‌ వస్తుందని తెలిస్తే మరిన్నీ దరఖాస్తులు పెరిగే అవకాశముందని అధికార వర్గాల నుంచి తెలుస్తుంది. గతంలో అనర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన దాఖాలాలు లేవు. అధికారులు పూర్తి స్థాయిలో అనర్హులను తొలగించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని