logo

ఆహార శుద్ధి పరిశ్రమలు.. ఉపాధికి బాటలు

ఆహార శుద్ధి పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. వ్యవసాయం, పాడి, మత్స్య సంపదలకు అనుబంధంగా ఆహార ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావించాయి.

Published : 10 Jun 2023 04:51 IST

ఆహార శుద్ధి యంత్రాల పనితీరును తెలుసుకుంటున్న ఔత్సాహికులు

న్యూస్‌టుడే, తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌) : ఆహార శుద్ధి పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. వ్యవసాయం, పాడి, మత్స్య సంపదలకు అనుబంధంగా ఆహార ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావించాయి. వీటి స్థాపనకు ముందుకొచ్చే వారికి పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ఉద్దేశం...

* సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం. ః పరిశ్రమల సామర్థాయభివృద్ధి, సాంకేతిక తోడ్పాటు అందించడం.

* ఆహార శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం.

* ఉత్పత్తులకు మార్కెటింగ్‌, బ్రాండింగ్‌కు అవకాశమివ్వడం.

* సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి.

రాయితీలు ఇలా..

వ్యక్తిగత సూక్ష్మ ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు 18 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం సహాయక, సహకార సంఘాలు, ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంఘాలు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. వీరికి ప్రాజెక్ట్‌ వ్యయంలో 35 శాతం, గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రాయితీ ఇస్తారు. అన్నదాత అనుబంధ పరిశ్రమలకు రైతు సహకార సంఘాలు, సమాఖ్యలు, ప్రభుత్వ ఏజెన్సీస్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి కూడా ప్రాజెక్ట్‌ వ్యయంలో 35 శాతం రాయితీ ఉంటుంది. పెట్టుబడి పరిమితి రూ.10 కోట్లు, గరిష్ఠ రాయితీ రూ.3 కోట్లు పది శాతం మూలధనం వాటా చెల్లించాలి. ఆహార తయారీ రంగంలో ఉన్న సహాయక సభ్యురాళ్ల సమాఖ్య దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులు...

మండల పరిషత్‌ కార్యాలయాలు, పురపాలకలు, జిల్లా పరిశ్రమల కేంద్రం ఇలా ఎక్కడి నుంచైనా సంబంధిత పరిశ్రమకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌, పాన్‌, రేషన్‌కార్డు/గ్యాస్‌బిల్లు/కరెంట్ బిల్లు, బ్యాంకు ఖాతాపుస్తకం, చరవాణి నంబర్‌, ఈ-మెయిల్‌, రుణం ఇవ్వడానికి బ్యాంకు అంగీకార పత్రం దరఖాస్తుతోపాటు సమర్పించాలి.

అపూర్వ అవకాశాలు..

జిల్లాలో ఆహార ఉత్పత్తి పరిశ్రమలకు అపూర్వ అవకాశాలున్నాయి. వరి, మొక్కజొన్న, పసుపు, మిరప, టమాట, పాడి ఉత్పత్తులకు నిలయం. ఆయా పంటలకు సంబంధించి పరిశ్రమలు, పాల పదార్థాల తయారీ పరిశ్రమలకు మంచి అవకాశాలు ఉంటాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి పొందడటంతోపాటు మరికొంత మందికి ఉపాధి చూపించవచ్చు. ఇటీవల కరీంనగర్‌తోపాటు హుజూరాబాద్‌లో పరిశ్రమలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా...

అసంఘటిత ఆహార ఉత్పత్తి, తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధియే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం (పీఎం-ఎఫ్‌ఎంఈ)’, ‘తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ’ సంయుక్తంగా ముందుకొచ్చాయి. ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసే ఔత్సాహికులకు అవసరమైన సహాయం అందించడంతోపాటు రాయితీలు అందజేస్తున్నాయి. ఈ పరిశ్రమలకు సంబంధించిన ప్రోత్సాహకాల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తున్నాయి. పరిశ్రమను ఏర్పాటు చేసిన తర్వాత మూడు నెలల్లో రాయితీ నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి. ఇప్పటి వరకు 74 యూనిట్ల వరకు జిల్లాలో ఏర్పాటయ్యాయి.

ఎలాంటివి అంటే..

బియ్యం, పప్పులు, నూనె మిల్లులు, చిరుధాన్యాలు, పాలు, సోయా ఉత్పత్తులు, చిప్స్‌, బిస్కెట్లు, బ్రెడ్‌, సాస్‌ల తయారీ, పాప్‌కార్న్‌, కార్న్‌స్నాక్స్‌ యూనిట్, బేకరి, పసుపు, పచ్చళ్లు, రవ్వ, పౌల్ట్రీ ఫీడ్‌ మిక్సింగ్‌ యూనిట్, పన్నీరు, చాక్‌లెట్, షుగర్‌కాండీ, మిఠాయిలు, పానీపూరి, సేమియా తయారీ పరిశ్రమ, నూడిల్‌్్స, ఇడ్లీ, దోశ, పాపడ్‌ తయారీ యూనిట్, ఆయుర్వేద మందుల పరిశ్రమ, ఫ్రూట్జామ్‌, జెల్లీ యూనిట్ తయారీ పరిశ్రమలు, గోదాముల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా చిన్నచిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని వ్యాపారవేత్తలుగా రాణించవచ్చు.

అవగాహన కల్పిస్తున్నాం

ఆహార ఉత్పత్తి పరిశ్రమలపై యువతకు, మహిళా సంఘాలు, ఇతరులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం అందించే రాయితీ, పరిశ్రమలకు ఉన్న అవకాశాలు, మార్కెటింగ్‌పై వివరిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో 74 యూనిట్లు ఏర్పాటు చేశారు. మరికొంత మంది ముందుకు వస్తున్నారు.

సాయినాథ్‌ రెడ్డి, జిల్లా రిసోర్స్‌పర్సన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని