logo

రైలు కూతకు ఇంకెంత కాలం

రైలు ప్రయాణం.. జిల్లా వాసుల చిరకాల వాంఛ.. దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ నుంచి గజ్వేల్‌ మీదుగా దుద్దెడ వరకు రైల్వే ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి.

Published : 10 Jun 2023 04:51 IST

జిల్లాలో కొల్కిరాని భూసేకరణ

సిద్దిపేట జిల్లా దుద్దెడ వద్ద నిర్మాణంలో రైల్వేట్రాక్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల : రైలు ప్రయాణం.. జిల్లా వాసుల చిరకాల వాంఛ.. దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ నుంచి గజ్వేల్‌ మీదుగా దుద్దెడ వరకు రైల్వే ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. గజ్వేల్‌ వరకు గూడ్స్‌ రైలు రాకపోకలు సాగిస్తోంది. తర్వాతి దశ సిద్దిపేటలో చేపట్టాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. ఇటీవల సిద్దిపేట శివారులో జరుగుతున్న పనులు మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. దుద్దెడ-సిద్దిపేట పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టులో సిద్దిపేటకు రైలు నడిచేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇక దాని తర్వాత జిల్లా పరిధిలోనే పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికీ జిల్లాలో సర్వే పూర్తయిన చోట పరిహారం పంపిణీ దశలో ఉన్నాయి.

ఆధ్యాత్మిక వారధి

ఈ రైల్వేలైను పరిధిలో మెదక్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలోని 70 గ్రామాలు.. 15 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీనృసింహాస్వామి, వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రాలు కలుపుతూ ఉంది. జిల్లాలో రైల్వేలైను పూర్తయితే ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట మీదుగా దిల్లీ వెళ్లే మార్గానికి ఉమ్మడి జిల్లా వాసులకు మరోమార్గం అందుబాటులోకి వస్తుంది. ముంబాయి, షిర్డీ పట్టణాలకు ఈ రైలు మార్గం అనువుగా ఉంటుంది.

ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలను అనుసంధానం చేసే మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైను నిర్మాణానికి రూ.1,160.47 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. 151.36 కిలోమీటర్లు రైల్వేలైనుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా భూసేకరణ, పరిహారం చెల్లింపులు కాగా కేంద్ర ప్రభుత్వం రైల్వేలైను నిర్మాణం చేస్తుంది. ఈ మార్గంలో ఇప్పటికే మనోహరాబాద్‌ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్‌, కొడగండ్ల మధ్య రైల్వేలైను పూర్తవడంతో పాటు ఆయా ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు సిద్ధమయ్యాయి.

గజ్వేల్‌ నుంచి సిద్దిపేట వరకు 32 కిలోమీటర్ల పరిధిలో సింగిల్‌ ట్రాక్‌ (ఒక లైను) నిర్మాణం జరుగుతోంది. సిద్దిపేటలో స్టేషన్‌ నిర్మాణం చివరి దశలో ఉంది. ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ట్రాక్‌ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే సిద్దిపేట స్టేషన్‌ వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. సిద్దిపేట స్టేషన్‌ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా శివారులో గుర్రాలగొంది వద్ద మరో స్టేషన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. సిద్దిపేట తర్వాత ఇక్కడి వరకు నిర్మాణం చేపట్టనున్నారు.

మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ మొదటి దశ. గజ్వేల్‌- సిద్దిపేట రెండో దశ కాగా మూడో దశ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనులు జరగాల్సి ఉంది. రైల్వేలైను కోసం జిల్లాలో 946.20 ఎకరాలు అవసరమని గుర్తించారు. దీనిలో 356 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇటీవలే వేములవాడ మండలంలోని నిర్వాసితులకు పరిహారంపై తుది నివేదికను సిద్ధం చేశారు. బోయినపల్లిలో కొంతమేరకు పరిహారం పంపిణీ పెండింగ్‌లో ఉంది. సిద్దిపేట నుంచి తంగళ్లపల్లి వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. తంగళ్లపల్లి నుంచి రాజరాజేశ్వర జలాశయం బ్యాక్‌ వాటర్‌ మీదుగా వంతెన నిర్మాణం చేపట్టాలి. దీనికి నీటిపారుదలశాఖ అనుమతుల దశలో ఉంది.

భూ సేకరణ పూర్తయింది

రైల్వేలైను భూసేకరణ దాదాపుగా పూర్తయింది. వేములవాడ సమీపంలో రెండొందల ఎకరాల మేరకు సేకరించాల్సి ఉంది. పరిహారం విషయంలో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆలస్యమవుతోంది. మిగతాచోట ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశాం. త్వరలోనే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తాం.

శ్రీనివాసరావు, ఆర్డీవో, సిరిసిల్ల

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు