logo

నిండా పచ్చదనం.. ప్రణాళికతోనే సాధ్యం

గ్రామాలను పచ్చదనంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. హరితహారంలో భాగంగా ఇంటింటా, ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టి మొక్కలను నాటారు.

Published : 10 Jun 2023 04:51 IST

నామాపూర్‌ నుంచి రాంరెడ్డిపల్లె వెళ్లే రోడ్డులో పచ్చదనం

న్యూస్‌టుడే, ముస్తాబాద్‌ : గ్రామాలను పచ్చదనంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. హరితహారంలో భాగంగా ఇంటింటా, ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టి మొక్కలను నాటారు. ఏటేటా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో పాటు పందిరిలా అల్లుకుని వాహన, పాదచారులకు చల్లని నీడనిస్తూనే చూపరులను ఆకట్టుకుని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

హరితహారం సత్ఫలితాలే ఇవి..

ముస్తాబాద్‌ మండలంలోని 22 గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వం హరితహారంలో భాగంగా అన్ని గ్రామాల్లో 2015 సంవత్సరం నుంచి హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఇళ్ల ముందు, వీధుల్లో, ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటారు. నాడు నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. జూన్‌ మాసం ఆరంభమైనా ఎండలు మండుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక వాహనాదారులు ప్రధాన రోడ్డుకిరువైపుల ఉన్న చెట్ల కింద వాహనాలు ఆపి కాసేపు సేద తీరుతున్నారు. ప్రధాన రోడ్డు సమీపంలోని రైతులు చెట్ల కిందకు వచ్చి అలసిపోయి కునుకు తీస్తున్నారు. మూడేళ్ల క్రితం చిప్పపల్లి ప్రధాన రోడ్డు వెంట నాటిన మొక్కలు ఏపుగా ఎదిగి వాహన, పాదచారులను ఆకట్టుకుంటున్నాయి. రెండేళ్ల క్రితం నామాపూర్‌ వెళ్లే రోడ్డులో అరకిలో మీటర్‌ వరకు, నామాపూర్‌ నుంచి రాంరెడ్డిపల్లె వెళ్లే రోడ్డులో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పైన కొమ్మలు అల్లుకుపోయి రోడ్డుపై చల్లని పందిరిని తలపిస్తున్నాయి. పోత్గల్‌ నుంచి ఆవునూర్‌, గూడెం ప్రధాన రోడ్డు నుంచి ఆవునూర్‌, వెంకట్రావుపల్లె బస్టాండ్‌ నుంచి గ్రామశివారు వరకు చెట్లు ఏపుగా పెరిగాయి. వచ్చే హరితహారంలోనూ ఇలా దూరదృష్టితో సత్ఫలితాలు వచ్చేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

వేసవిలోనూ ఇక్కడ ఆహ్లాదమే..

నామాపూర్‌ గ్రామం నుంచి గూడెం బస్టాండ్‌ వెళ్లే రోడ్డుకిరువైపుల హరితహారంలో భాగంగా మూడేళ్ల క్రితం నాటిన మొక్కలు ఎదిగాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నా.. పందిరిలా అల్లుకుపోయిన చెట్లు పాదచారులకు, వాహనదారులకు చల్లని నీడతోపాటు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ముస్తాబాద్‌ మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో ప్రధాన రోడ్ల వెంట అడుగడుగునా పచ్చని చెట్లు దర్శనమిస్తుండడంతో దూరప్రాంతాలకు వెళ్లే వాహనదారులు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.

మద్దికుంట రాములు, నామాపూర్‌

వర్షాలు పడగానే హరితహారం

గతంలో హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాం. అవి ఏపుగా పెరిగాయి. ప్రధాన రోడ్ల వెంట పచ్చందాలను తలపిస్తున్నాయి. మళ్లీ వర్షాలు ప్రారంభం కాగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గ్రామాన్ని బట్టి నర్సరీలలో మొక్కలను పెంచుతున్నాం. ప్రతీ ఇంటిముందు, ప్రధాన రోడ్ల వెంట, సముదాయాల వద్ద, కార్యాలయాల ఆవరణలో నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైన చోట్ల మొక్కలను నాటి సంరక్షిస్తాం.

ఆనంద్‌ మోహన్‌, ఏపీవో

ముస్తాబాద్‌ నర్సరీలో పెరుగుతున్న మొక్కలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని