logo

హరిత లక్ష్యం చేరేనా!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం హరిత తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో 2014లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Published : 10 Jun 2023 04:53 IST

9వ విడతలో జిల్లా లక్ష్యం 18,03,000 మొక్కలు

కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్‌ నర్సరీలో సిద్ధంగా మొక్కలు

న్యూస్‌టుడే, కోరుట్ల : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం హరిత తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో 2014లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతంలో ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం’లో ఊరురా విస్తృతంగా మొక్కలను నాటించే కార్యక్రమం అమలు చేస్తుంది. ప్రస్తుత ఏడాది ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న ‘తెలంగాణ హరితోత్సవం’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఇప్పటికే నిర్దేశించింది. అదే రోజు 9వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల వెల్లడించారు. దీంతో జగిత్యాల జిల్లాలో 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమౌతుంది.

స్వల్ప లక్ష్యంతో సాధన

9వ విడత హరితహారం కార్యక్రమం ద్వారా ఊరురా, పంచాయతీ వాడల్లో, రోడ్ల కిరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, రైతుల భూముల్లో, పొలం గట్లపై, ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ఉపాధిహామీ సిబ్బంది స్థలాలను ఇప్పటికే గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో, ఇంటింటికీ పంపిణీ చేసేందుకు గ్రామపంచాయతీలోని నర్సరీల్లో నీడనిచ్చే, పండ్ల, పూల మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. గతంలో ప్రతి గ్రామపంచాయతీకి 40వేల మొక్కలు నాటాలనే లక్ష్యంను జిల్లా అధికారులు నిర్దేశించేవారు. అధికారులు కేటాయించిన లక్ష్యం అందుకోవడం కష్టంగా మారేది. నామమాత్రంగా మొక్కలు నాటి కాగితాల మీద లెక్కలు చెప్పడంతో విమర్శలపాలయ్యేవారు. 2022-23 నుంచి గ్రామపంచాయతీలలో ఎన్ని మొక్కలు నాటాలనే లక్ష్యంను ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ పాలకులకు అప్పగించారు. వారు డిసెంబర్‌లో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలో ఏరకమైన మొక్కలు ఎన్నినాటాలి, ఇళ్లలో ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి మొక్కలు నాటించవచ్చని నిర్ణయిస్తారు. గ్రామాల్లో ఇప్పటికే మొక్కలు నాటించే స్థలాలను గుర్తించారు. గ్రామపంచాయతీ పరిధిలోని పరిస్థితులను బట్టి స్వల్ప లక్ష్యం నిర్దేశించుకోవడంతో శతశాతం అమలు పరిచేందుకు ఉపాధిహామీ సిబ్బంది, పాలక యంత్రాంగం శ్రమిస్తున్నారు. ఈవిషయమై ‘న్యూస్‌టుడే’ జిల్లా డీఆర్‌డీఏ పీడీ లక్ష్మినారాయణను సంప్రదించగా 19న హరితోత్సవం రోజునే జిల్లావ్యాప్తంగా హరితహారం కార్యక్రమం అమలు చేసేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. అదేరోజున అన్ని గ్రామాల్లో, ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. వర్షాలు కురిసే పరిస్థితులను బట్టి మొక్కలను నాటిస్తామని, అప్పటివరకు ఉపాధిహామీ సిబ్బంది కూలీలతో గుంతలను తవ్వి, మొక్కలను సరఫరా చేసి సిద్ధంగా ఉంచుతామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలను పూర్తిస్థాయిలో నాటిస్తామని పేర్కొన్నారు. 

కోరుట్ల మండలం సంగెం రోడ్డులో మొక్కలు నాటకుండా వదిలేసిన రహదారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని