logo

క్రీడాకారులపై ఆంక్షలు.. నైపుణ్యానికి ప్రతిబంధకాలు

సింగరేణి కీర్తిని కోల్‌ ఇండియాలో ఎగరేయాలి.. నైపుణ్యంతో రాణించాలి.. క్రీడలకు సింగరేణి ప్రాధాన్యమిస్తోంది. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం..

Updated : 18 Sep 2023 05:57 IST

50 ఏళ్లు దాటిన వారికి అనుమతి లేదు
సింగరేణి ఆదేశాలపై ఆందోళన
న్యూస్‌టుడే, గోదావరిఖని

కోల్‌ఇండియా స్థాయి కబడ్డీ పోటీలో తలపడుతున్న సింగరేణి క్రీడాకారులు (పాతచిత్రం)

సింగరేణి కీర్తిని కోల్‌ ఇండియాలో ఎగరేయాలి.. నైపుణ్యంతో రాణించాలి.. క్రీడలకు సింగరేణి ప్రాధాన్యమిస్తోంది. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం.. ఇది నిత్యం సింగరేణి యాజమాన్యం మాట్లాడే మాటలు.. కాగా తీసుకునే నిర్ణయాలు నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. క్రీడాకారులపై ఆంక్షలు విధిస్తూ జారీచేసిన ఆదేశాలు అసంతృప్తికి గురిచేస్తున్నాయి. నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన యాజమాన్యం వయస్సును పరిగణలోకి తీసుకోవడంతో ప్రతిభ ఉన్న వారికి అవకాశం లేకుండా పోతుంది. సింగరేణి యాజమాన్యం తాజాగా జారీ చేసిన ఆదేశాలు సీనియర్‌ క్రీడాకారులను మనస్తాపానికి గురిచేస్తున్నాయి. వీటిని కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో సైతం ఇదే విధంగా ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాలపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేయడంతో వెంటనే విరమించుకుంది. తాజాగా మళ్లీ అదే విధంగా ఆంక్షలు విధించడంతో క్రీడాకారులు అసంతృప్తికి గురవుతున్నారు. 50 సంవత్సరాలు దాటిన క్రీడాకారులు కేవలం డివిజన్‌ వరకే పరిమితం కావాలన్న ఆదేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. 50 ఏళ్లు దాటిన వారు బృంద క్రీడల్లో పాల్గొనకూడదని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత క్రీడల కంటే బృంద క్రీడల్లోనే ఎక్కువ మంది సీనియర్లు ఉన్నారు. కోల్‌ఇండియా స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన వారంతా అదే వయస్సు వారే. ఇప్పటి వరకు వేయిట్‌లిఫ్టింగ్‌, బాడీబిల్డింగ్‌తో పాటు సాంస్కృతిక ప్రదర్శనల్లో ఎక్కువ శాతం పతకాలు సాధించారు. క్రికెట్‌తో పాటు హకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ పోటీల్లో అనేక సార్లు పతకాలు సాధించారు. వీటిలో 50 ఏళ్లు నిండిన క్రీడాకారులు పాల్గొన్నారు. తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో వీరు బృంద జట్టులో పాల్గొనే అవకాశం లేకుండా పోతోంది.

ఆందోళన బాట

సింగరేణి విడుదల చేసిన ఆదేశాలపై కార్మిక సంఘాలతో పాటు క్రీడాకారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. యాజమాన్యం జారీ చేసిన ఆదేశాలు నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు ప్రతిబంధకంగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అన్ని కార్మిక సంఘాల నాయకులను సీనియర్‌ క్రీడాకారులు కలిసి విన్నవించారు. దీనిపై కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యంతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మార్పు చేయకుంటే ఆందోళనకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.

ఆసక్తి చూపని యువతరం...

ఇటీవలి కాలంలో యువకులు క్రీడల్లో ఆసక్తి చూపడం లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారెవరూ పెద్దగా క్రీడల్లో పాల్గొనడం లేదు. మళ్లీ పాత క్రీడాకారులే పోటీ పడుతున్నారు. సింగరేణిలో నిర్వహించే ప్రాంతీయ, సింగరేణి స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి సన్నగిల్లుతోంది. కేవలం క్రికెట్‌ పోటీల సమయంలో మాత్రమే కొంత మంది యువ క్రీడాకారులు ఉత్సాహంగా కనిపిస్తున్నా మిగతా క్రీడల పట్ల యువకులు ముందుకు రావడం లేదు. సింగరేణిలో గత మూడేళ్లలో 12 వేల మంది యువ ఉద్యోగులు చేరారు. ఇందులో 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. సింగరేణి స్థాయిలో నిర్వహించే వార్షిక క్రీడల్లో పాల్గొనేందుకు వీరు ఆసక్తి చూపడం లేదు. డివిజన్‌ స్థాయితో పాటు రీజియన్‌, ఆ తర్వాత సింగరేణి స్థాయిలో ఎంపిక చేసి కోల్‌ ఇండియా పోటీలకు పంపిస్తారు. కనీసం డివిజన్‌ స్థాయి పోటీలకు సైతం యువ ఉద్యోగులు ముందుకు రావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని