logo

అభివృద్ధి.. సంక్షేమంలో దేశానికి దిక్సూచి

రాచరికం నుంచి ప్రజాస్వామ్య పరిపాలన వైపు పరివర్తన చెందిన తెలంగాణ స్వతంత్ర భారతదేశంలో విలీనమైందని, తర్వాత అరవై ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించి ప్రస్తుతం...

Updated : 18 Sep 2023 05:58 IST

జాతీయ సమైక్యతా వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

జెండాకు వందనం చేస్తున్న వినోద్‌ కుమార్‌, చిత్రంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కళ

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాచరికం నుంచి ప్రజాస్వామ్య పరిపాలన వైపు పరివర్తన చెందిన తెలంగాణ స్వతంత్ర భారతదేశంలో విలీనమైందని, తర్వాత అరవై ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించి ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగిన జాతీయ సమైక్యతా వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనిక పాలనలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమం ఇలా అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలుస్తోందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక్కసారి తరచి చూసుకుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల కంటే పదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ ఎన్నో రెట్లు ఎక్కువ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. దీనికి నిదర్శనం దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటమేనన్నారు. అలాగే తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దేశంలో మొదటి స్థానం, విద్య, వైద్య రంగాల్లోనూ ముందు వరుసలో ఉందన్నారు.

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌

స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తి చేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్ది, కరవు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చడం కేసీఆర్‌ నాయకత్వంలోనే సాధ్యమైందని వినోద్‌కుమార్‌ చెప్పారు. జిల్లాలో 2016లో సాధారణ సాగుభూమి 1.77 లక్షల ఎకరాలు ఉండేదని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులతో అది 2.4 లక్షల ఎకరాలకు చేరిందని చెప్పారు. రైతులు పండించిన పంట నిల్వలకు వీలుగా జిల్లాలో రూ.33 కోట్లతో 55 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న 14 గోదాంలను నిర్మించినట్లు వెల్లడించారు.

నియోజకవర్గానికి మూడు వేల గృహాలు

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్న మూడు పురపాలికల్లోని 447 ఆవాసాలకు రూ.1,132 కోట్లతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా ప్రత్యేకత చాటుకుందన్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా జిల్లాలో ఇప్పటికీ 3,443 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. వాటిని దశల వారీగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకంలో తొలి విడత నియోజకవర్గానికి మూడు వేల గృహాల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న వారికి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు మంజూరులో ప్రాధాన్యం ఇస్తామన్నారు. అలాగే దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అర్హులైన 1.2 లక్షల మంది ఆసరా పింఛనుదారులకు ప్రతి నెలా రూ. 26.51 కోట్లు పంపిణీ చేస్తుందన్నారు.

కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

నేతన్నకు అండగా

ప్రభుత్వం నేతన్నకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని వినోద్‌కుమార్‌ తెలిపారు. మరమగ్గాల కార్మికులు, ఆసాములకు నిరంతరం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో బతుకమ్మ, క్రిస్మస్‌, రంజాన్‌తోపాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవసరమైన వస్త్రోత్పత్తుల ఆర్డర్లను ప్రభుత్వం సిరిసిల్ల పరిశ్రమకు కేటాయిస్తోందన్నారు. కార్మికులను యజమానులుగా చేయాలనే ఉద్దేశంతో పెద్దూరులో 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో వీవింగ్‌ పార్కు, పక్కనే 88 ఎకరాల్లో రూ.388 కోట్లతో అపరెల్‌ పార్కులను నిర్మించినట్లు తెలిపారు. అపరెల్‌ పార్కులో ఇప్పటికే రెండు పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా రెండు వేల మంది పైగా మహిళలు ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. నేతన్న బీమాను త్రిఫ్ట్‌ ఫండ్‌కు అనుసంధానం చేసి 75 ఏళ్లు దాటిన వారికి సైతం ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో 4,644 మంది మరమగ్గాల కార్మికులు నేతన్న బీమా పథకంలో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ప్రవీణ్‌, సహకార విద్యుత్తు సరఫరా సంఘం ఛైర్మన్‌ చిక్కాల రామారావు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జిందం కళ, అదనపు కలెక్టర్‌లు ఖీమ్యానాయక్‌, గౌతంరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు