logo

అభివృద్ధి రూపు.. సంక్షేమ మెరుపు

 ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా జిల్లా అభివృద్ధి విషయంలో రూపు మార్చుకుంటుందని.. సంక్షేమమనే మెరుపు అన్నివర్గాల ప్రజల దరి చేరుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

Updated : 18 Sep 2023 05:56 IST

సర్వతోముఖాభివృద్ధి జిల్లా సొంతం
జాతీయ సమైక్యతా వేడుకల్లో మంత్రి గంగుల

వందన సమర్పణలో మంత్రి గంగుల కమలాకర్‌, చిత్రంలో కలెక్టరు గోపి, సీపీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మేయర్‌ సునీల్‌రావు

ఈనాడు, కరీంనగర్‌:  ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా జిల్లా అభివృద్ధి విషయంలో రూపు మార్చుకుంటుందని.. సంక్షేమమనే మెరుపు అన్నివర్గాల ప్రజల దరి చేరుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన జాతీయ సమైక్యతా వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనను అందించేందుకు కృషి చేసిన ఎందరో త్యాగధనుల పోరాటం మరువలేనిదన్నారు. సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ ప్రదర్శించిన చతురతతో సంస్థానాలు భారతదేశంలో ఏకీకృతమయ్యాయని.. అసలైన భారతదేశం ఏర్పాటైందన్నారు. దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన  పలు అభివృద్ధి రూపురేఖలను తన మాటల్లో వెల్లడించారు.

ప్రసంగిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

ప్రగతి పంథా ఇలా..

  • రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతోపాటు అనేక అనుబంధ వృత్తులను ప్రోత్సహిస్తోంది. వలసలను అరికట్టేందుకు స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. వెనుకబడిన తరగతులకు చెందిన 1700 మందికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.లక్ష చొప్పున రుణ సాయమందించాం.
  • మైనారిటీ వర్గాలకు జిల్లాలో 174 మందికి రుణ సాయమందించాం. ఇది నిరంతర ప్రక్రియ. బీడీ టేకెదారులకు రూ.2016ను ఇటీవల పంపిణీ చేశాం. ఆసరా పింఛన్‌ల ద్వారా పేదలకు భరోసాను అందిస్తున్నాం.
  • జిల్లాలో పల్లెల రూపురేఖలు మారాయి. ఇటీవల 9 మండలాల్లోని 15 గ్రామాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డులు రావడం అభినందనీయం. జాతీయ స్థాయిలో ఖాసీంపేట రెండో స్థానం, రామడుగు మండలం వెలిచాల 5వ స్థానాన్ని దక్కించుకోవడం అధికారులు, పాలకుల పనితీరుకు నిదర్శనం.
  • పేదలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున వంద శాతం రాయితీతో రూ.3 లక్షలు ఇవ్వబోతున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలందిస్తున్న వారి పదవి విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాం. దళితబంధు విషయంలో జిల్లా ఆదర్శంగా ఉంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 18,021 మందికి ఇచ్చాం.
  • కరీంనగర్‌ నగరంలో వెలుగు జిలుగుల మధ్య అందమైన రహదారులతో అన్ని వీధుల రూపు మారిపోయింది. తీగల వంతెనతోపాటు మానేరు రివర్‌ఫ్రంట్‌తో సరికొత్త పర్యాటక కేంద్రంగా ఇది మారుతుంది.

బాలభవన్‌ విద్యార్థినుల నృత్యం

అలరించిన కార్యక్రమాలు..

పరేడ్‌ మైదానంలో పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని చాటి చెప్పే పాటలపై చిన్నారులు నృత్యాలు చేశారు. పోలీసు శాఖ, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద సమయాల్లో అనుసరించే సాహసోపేతమైన సన్నివేశాన్ని ప్రదర్శించారు. ఓటరు చైతన్యంపై మహిళా సంఘాల సభ్యులు, పాఠశాలల చిన్నారుల నాటికలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యుల ఆటాపాటలు ఆకర్షణగా నిలిచాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలనే చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్లపై వివక్షను రూపుమాపాలని ప్రదర్శించిన సన్నివేశానికి సభికులంతా అభినందనలు తెలిపారు. సమరయోధులను సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ గోపి, అదనపు పాలనాధికారులు ప్రఫుల్‌దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, మేయర్‌ సునీల్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, సుడా ఛైర్మన్‌ జీవీ.రామకృష్ణారావు, గ్రంథాలయ ఛైర్మన్‌ అనిల్‌, ఏఎంసీ ఛైర్మన్‌ మధుముదిరాజ్‌, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపారాణి హరిశంకర్‌, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కస్తూర్బా విద్యార్థినులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని