logo

శారీరక దృఢత్వంతోనే మానసికోల్లాసం

శారీరక దృఢత్వంతోనే మానసికోల్లాసం లభిస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని ఆయన సూచించారు.

Published : 22 Sep 2023 04:23 IST

జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభంలో మంత్రి కమలాకర్‌

క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి గంగుల  కమలాకర్‌, చిత్రంలో ఎమ్మెల్యే రసమయి, తదితరులు

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే : శారీరక దృఢత్వంతోనే మానసికోల్లాసం లభిస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని ఆయన సూచించారు. తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గతంలో చదవాలన్న కోరిక ఉన్న చదివించే ప్రభుత్వాలు లేవని నేడు సీఎం కేసీఆర్‌ అందరికి విద్యనందించాలనే ఉద్దేశంతో కేజీ టు పీజీ విద్య ప్రవేశపెట్టారని వివరించారు. విద్యార్థులు క్రీడలకు దూరం కావద్దనే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం 19 గురుకులాల్లో 8వేల మంది విద్యార్థులు చదువుకునేవారని, ప్రస్తుతం 337 గురుకులాల్లో 1,85,000 మంది విద్యనభ్యసిస్తున్నారన్నారు. గురుకులాల్లో అందించే నాణ్యమైన విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. పాఠశాలలో నీటి సమస్య ఉందని పలువురు విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకు రాగా సాయంత్రంలోగా సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. వర్షం కారణంగా పోటీలకు కొంత అంతరాయం కలిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జిల్లా పాలనాధికారి గోపి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మధు, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల డిప్యూటీ కమీషనర్‌ తిరుపతి, ప్రిన్సిపల్‌ విమల, భారాస మండలాధ్యక్షుడు రమేష్‌, ఎంపీపీ వనిత, సర్పంచులు నీలమ్మ, శ్రీవాణి, రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, ఏకానందం తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల మాటలకు మంత్రి ఫిదా..

క్రీడా పోటీలు ప్రారంభించిన అనంతరం మంత్రి అక్కడి నుంచి వెళ్తుండగా చిన్నారులంతా అడ్డగించి, వారి ముద్దు ముద్దు మాటలతో తమ నృత్యాన్ని చూడాలని కోరారు. వారి మాటలకు ముగ్ధుడైన మంత్రి చిన్నారుల డ్యాన్స్‌ను తిలకించి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని