logo

ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం

జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయి, వాటిలో మౌలిక వసతులు అందుబాటులో ఉన్న వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

Published : 22 Sep 2023 04:23 IST

లబ్ధిదారుల ఎంపికకు సర్వే
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణం పెద్దూరులో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లు

జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయి, వాటిలో మౌలిక వసతులు అందుబాటులో ఉన్న వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీనికోసం మండలాల వారీగా పూర్తయిన ఇళ్ల నిర్మాణాలు, వాటికి వచ్చిన దరఖాస్తుల జాబితాలో అర్హులను గుర్తిస్తున్నారు. ఈ నెలాఖరు, వచ్చే నెలలో విడతల వారీగా ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో పేదలకు ఇవ్వాలని పలు దశల్లో 6,886 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షల చొప్పున కేటాయించారు. ఇప్పటికీ 3,402 నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికి రూ. 209 కోట్లు ఖర్చు చేశారు. సిరిసిల్ల పట్టణంలో మంగళవారం నాలుగో విడత లబ్ధిదారుల ఎంపిక జరిగింది. దీనిలో పెద్దూరు, రగుడులోని ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హుల్లో 516 మందిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇంకా శాంతినగర్‌, మండెపల్లిలో 264 నిర్మాణాలు పూర్తయినవి ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాల్లో నిర్మాణం పూర్తయిన వాటిలో సింహభాగం పంపిణీ జరిగింది. వేములవాడ నియోజకవర్గంలో వట్టెంల, వేములవాడ పట్టణంలో ఒక విడత పంపిణీ చేశారు. కోనరావుపేట, చందుర్తి, రుద్రంగిలో టెండర్ల దశలోనే ఉన్నాయి. ఇల్లంతకుంటలో నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక కాలేదు.

మౌలిక వసతుల్లో జాప్యం

మౌలిక వసతుల కల్పనలో జాప్యం వల్ల రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ కావడం లేదు. ఇప్పటి వరకు పంపిణీ జరిగిన చోట అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, విద్యుత్తు, తాగునీటి వసతులు పూర్తయ్యాయి. చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా, ఏదో ఒక సమస్యతో నిలిచిపోయాయి. సిరిసిల్ల పురపాలికకు మంజూరైన ఇళ్లకు పురపాలకశాఖ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లోనే సమస్య ఉంది. తంగళ్లపల్లి మండలం జిల్లెలలో 20 ఇళ్లు పూర్తి చేశారు. అంతర్గత రహదారులు, విద్యుత్తు సౌకర్యం, మురుగు కాల్వల నిర్మాణం పూర్తయింది. కానీ ఆ గృహాలకు వెళ్లేందుకు రహదారి లేక లబ్ధిదారుల పరిశీలనకే పరిమితమైంది. ఇదే మండలంలోని రామన్నపల్లిలో మురుగు కాల్వలు లేక పంపిణీ ఆగిపోయింది. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేసినవి ఏళ్ల తరబడి పంపిణీకి  నోచుకోకపోవడంతో ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుతున్నాయి.

మూడింతల దరఖాస్తులు

ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన మండలాలు, గ్రామాల్లో ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఒక్కోచోట రెండు, మూడింతల దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు దఫాలుగా వడ పోశారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన చోట అర్హులమైన తమకు ఇళ్లు కేటాయించడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులపై లబ్ధిదారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన 11వ వార్డు కౌన్సిలర్‌ మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమ వార్డుకు కేటాయించిన వాటిలో తక్కువ మందిని ఎంపిక చేశారని ఆరోపించారు. ఇతర కౌన్సిలర్లు సర్దిచెప్పడంతో నిరసన విరమించారు. మరికొన్ని చోట్ల గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని అర్హులకు నచ్చజెప్పుతున్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల పంపిణీపై అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ను సంప్రదించగా గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పరిశీలన జరుగుతుందన్నారు. త్వరలోనే అర్హులైన వారికి పంపిణీ చేస్తామన్నారు.

తంగళ్లపల్లి మండలం జిల్లెలలో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని