logo

సమయం లేదు మిత్రమా!

అయిదేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కల నెరవేరింది.. రాష్ట్ర ప్రభుత్వం టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ (టీఆర్టీ) ప్రకటనను విడుదల చేసింది..

Published : 22 Sep 2023 04:23 IST

ఉపాధ్యాయ కొలువుకు ప్రణాళికతో చదువు
పరీక్షకు రెండు నెలలే గడువు
2017 టీఆర్టీ విజేతల సూచనలు
న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం

టీఆర్టీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు (పాత చిత్రం)

యిదేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కల నెరవేరింది.. రాష్ట్ర ప్రభుత్వం టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ (టీఆర్టీ) ప్రకటనను విడుదల చేసింది.. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఈసారి ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో మొత్తం 393 పోస్టులు భర్తీ కానున్నాయి. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండటం, టీఆర్టీకి హాజరయ్యే వారి సంఖ్య 15వేలకు పైగా ఉండటంతో తీవ్ర పోటీ నెలకొననుంది. మరో వైపు టీఆర్టీ పరీక్షలు నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. దీంతో పరీక్షలకు రెండు నెలల సమయమే ఉండటం, అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఉద్యోగ సాధనకు అభ్యర్థులు శ్రమించాల్సిందే. ఉన్న కొద్ది సమయంలో ప్రణాళికతో చదివితేనే ఉద్యోగాలు సాధించవచ్చని 2017 టీఆర్టీలో ప్రతిభ చాటిన అభ్యర్థులు పేర్కొంటున్నారు.

నిపుణుల సూచనలివీ..

  • సమయం తక్కువుంది. ఉన్న 60 రోజుల సమయానికి అనుగుణంగా సిలబస్‌ను విభజించుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్ణీత సమయంలో చదవడం, పునశ్చరణ పూర్తి చేయాలి.
  • రోజుకు 10 గంటలకు తక్కువ కాకుండా చదివితేనే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
  • గతంలో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఎప్పటికప్పుడు ముఖ్యమైన అంశాలపై నోట్స్‌ తయారు చేసుకోవాలి.
  • స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు అభ్యర్థులు ఇంటర్‌ వరకు, ఎస్జీటీ ఉద్యోగాలకు పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదివి అవగాహన పెంచుకోవాలి.
  • రెండు విభాగాలకు అదనంగా జీకే, సమకాలీన అంశాలు చదవాలి. దిన పత్రికలను చదవడం, క్రీడలు, అవార్డులు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని ప్రగతి, వర్తమాన రాజకీయాలు, కమిటీలు, రాష్ట్ర, జాతీయ చిహ్నాలు, అంతరిక్ష, అణుసాంకేతిక అంశాలు, జనాభా, దేశాలు, రాజధానులు, కరెన్సీ వంటి అంశాలను ఆధ్యయనం చేయాలి. ఇందుకు రోజుకు కొంత సమయాన్ని కేటాయించాలి.
  • తక్కువ సమయం ఉందని ఒత్తిడికి గురికావొద్దు. మధ్యమధ్యలో విరామమిస్తూ చదవడం ద్వారా చదివింది బాగా గుర్తు పెట్టుకోవచ్చు.
  • రోజూ ఉదయం కొంతసేపు యోగా చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించొచ్చు.
  • ఆహారం విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంటి ఆహారం తీసుకోవాలి. వీలులేని వారు వేడి ఆహారం తీసుకోవడం అవసరం. దీనివల్ల ఆరోగ్యం పాడు కాకుండా జాగ్రత్త పడొచ్చు. చదువుకునే సమయంలో స్నాక్స్‌గా జంక్‌ఫుడ్‌ తినడం కన్నా పండ్లు, లేదా డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి.

ఎక్కువ సాధన చేయండి

2017 టీఆర్టీలో 5వ ర్యాంకు సాధించా. అంతకుముందు జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను, సొంతంగా తయారు చేసుకున్న నోట్స్‌ను ఎక్కువగా సాధన చేశాను. తెలుగు అకాడమి వారి పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదివా. ఇప్పుడు టీఆర్టీకి తక్కువ సమయం ఉన్నందున కొత్తవాటి జోలికి అభ్యర్థులు వెళ్లకుండా చదివిన వాటినే ఎక్కువ సాధన చేయాలి. పెడగాజిలో ఫర్‌ఫెక్ట్‌ ఎడ్యుకేషన్‌ కోసం ఒక పుస్తకాన్ని, అందులో ప్రతి అంశాన్ని చదవాలి. భావ కవిత్వాలపై ప్రధాన దృష్టి సారించాలి. కవులను యుగంగా విభజించుకుని గుర్తుపెట్టుకునేలా దృష్టి నిలపాలి. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారనే దాన్ని గుర్తించి ప్రత్యేకంగా సాధన చేయాలి.

ఎం.నరేశ్‌, స్కూల్‌ అసిస్టెంట్‌(తెలుగు), ఆత్మకూర్‌

సమగ్రంగా చదవాలి

టీఆర్టీలో రాష్ట్రంలో 104వ ర్యాంకు సాధించా. పరీక్షకు సన్నద్దమయ్యేందుకు అప్పుడు ఎక్కువ సమయం ఉంది. నిత్యం 10 గంటలకుపైగా చదివాం. పాఠ్య పుస్తకాలను ఎక్కువగా సాధన చేశా. ఇప్పుడు సమయం తక్కువ ఉన్నా అభ్యర్థులు పుస్తకాలు సమగ్రంగా చదివి అవగాహన పెంచుకోవాలి. కంటెంట్‌, మెథడ్స్‌తోపాటు విద్యా దృక్పథాలు, జీకే, సమకాలీన అంశాలపై సమాంతరంగా సన్నద్ధమవ్వాలి. కరంట్‌ అఫైర్స్‌లో వచ్చే అంశాలకు లింక్‌ ఉండే పూర్వపు అంశాలను జీకేగా అడిగే అవకాశమున్నందున వాటిపై దృష్టి నిలపాలి. పరీక్షకు కనీసం 10 రోజుల ముందు నుంచి ఓ వైపు చదువుతూనే పునశ్చరణ, ప్రాక్టీస్‌ టెస్టులకు సమయం కేటాయించుకోవాలి. ప్రశ్న అడిగే విధానం మారినందున అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరం.

ఇరుగాల ప్రశాంత్‌, ఎస్జీటీ, గర్షకుర్తి

ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహన

టీఆర్టీలో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకును సాధించా. ప్రణాళికతో చదవడంతోపాటు అన్ని పాఠ్యాంశాల ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహన పెంచుకుని పరీక్షకు సన్నద్ధమయ్యా. ప్రాథమిక భావనలపై ఎక్కువ ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉన్నందున అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించాలి. పాఠశాల స్థాయి సిలబస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. బారు వడ్డీ, చక్రవడ్డీ, లాభనష్టాలు, బహుపదులు, త్రికోణమితి, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, శ్రేఢులు, సమితులు, క్షేత్రమితిలపై ఎక్కువ ధ్యాస పెట్టాలి. మెథాడలజీలో లక్ష్యాలు- సృష్టీకరణలు, ఉద్దేశాలు, విలువలు, బోధన పద్దతులు, బ్లూమ్స్‌ వర్గీకరణ, బోధన ఉపకరణ సామగ్రి, ఐసీటీ, మూల్యాంకనంపై అవగాహన పెంచుకోవాలి. పరీక్ష రాసేప్పుడు అనవసర తప్పిదాలు లేకుండా చూసుకోవాలి.

భగత్‌, స్కూల్‌ అసిస్టెంట్‌(గణితం), పోతారం

సొంతంగా నోట్స్‌ రాసుకుంటూ..

టీఆర్టీలో రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంకు సాధించా. సిలబస్‌ను సమయానికి అనుగుణంగా విభజించుకుని ప్రణాళికతో చదవాలి. జీకే, సమకాలీన అంశాలు, పర్‌ఫెక్టివ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ టీచింగ్‌ టెక్నాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ కంటెంట్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి. 6-10వ తరగతి పాఠ్యాంశాలను సమగ్రంగా చదివి అవగాహన పెంచుకోవాలి. ప్రతి పాఠ్యాంశం చదవగానే దానికి సంబంధించిన ప్రాక్టీస్‌ పేపర్స్‌ చేయాలి, షార్ట్‌నోట్స్‌ తయారు చేసుకోవాలి. ఫిజిక్స్‌లో సమస్యల సాధన ఎక్కువగా చేయాలి. ప్రభుత్వ ప్రచురణల పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తక్కువ సమయం ఉన్నందున అభ్యర్థులు ప్రతి పాఠ్యాంశానికి సొంతంగా షార్ట్‌కట్స్‌, బిట్స్‌ రాసుకుంటూ పునశ్చరణ చేసుకోవాలి.

బొప్ప జ్యోతి, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ సైన్స్‌), ధర్మపురి

పాఠ్య పుస్తకాల అధ్యయనం కీలకం

టీఆర్టీలో రాష్ట్రంలో 3వ, ఉమ్మడి జిల్లాలో మొదటి ర్యాంకును సాధించా. సిలబస్‌ ఆధారంగా ప్రణాళికతో పాఠ్య పుస్తకాలన్నింటిని చదివి పూర్తి స్థాయిగా అప్పుడు సిద్ధమయ్యాను. ఇప్పుడు సమయం తక్కువున్నా ఇప్పటికే అభ్యర్థులు చదువుతుంటారు కాబట్టి పాఠ్య పుస్తకాలు చదవడం కచ్చితంగా పూర్తి చేయాలి. అత్యధిక ప్రశ్నలు సాంఘిక శాస్త్రం కంటెంట్‌, మెథడాలజీవే ఉంటాయి. అభ్యర్థులు 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు పుస్తకాలను లోతుగా చదవాలి. ఒక అంశాన్ని లేదా ఒక పాఠాన్ని మరోదానితో అనుసంధానం చేస్తూ అర్థం చేసుకోవాలి. ఉన్న సమయానికి అనుగుణంగా ప్రణాళికతో సిద్ధమవ్వాలి.

మందపల్లి గంగాధర్‌, స్కూల్‌అసిస్టెంట్‌ (సాంఘికశాస్త్రం) తిమ్మాపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని