logo

గంజాయి మత్తు... యువత చిత్తు

గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. పట్టణాల్లºనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మత్తు పాకుతోంది.

Updated : 16 Apr 2024 05:38 IST

చాప కింద నీరులా విక్రయాల జోరు

పోలీసులు పట్టుకున్న గంజాయి

న్యూస్‌టుడే, వేములవాడ: గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. పట్టణాల్లºనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మత్తు పాకుతోంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు, యువత దీనికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసు తనిఖీల్లో వెల్లడైంది. వేములవాడ పట్టణం, వేములవాడ గ్రామీణ మండలం, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వేములవాడ పట్టణంలో కొన్ని ప్రాంతాలు గంజాయి, గుట్కాల విక్రయాలకు అడ్డాలుగా మారాయి. వాటి వద్ద యువత ఎప్పుడూ దర్శనమివ్వడం అనుమానాలకు తావిస్తోంది.

వివిధ రూపాల్లో సరఫరా...

కొన్ని పాన్‌ షాపులు, హోటళ్లు, ఐస్‌క్రీం, సోడా బండ్లు, ఆటోల అడ్డాల వద్ద గంజాయి విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయి. సిగరెట్లు, పాన్‌మసాలా వంటి వివిధ రూపాల్లో సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. యువత సిగరెట్లలోని తంబాకును తొలగించి గంజాయి నింపుతూ తాగుతున్నారు. రాత్రి వేళల్లో పాఠశాల ప్రాంతాలు, చెరువు గట్లు, పట్టణ పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో తాగుతున్నారు. గతంలో పట్టుబడిన యువతను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ మార్పు రావడం లేదు. దీనికి బానిసలైన వారు ఎక్కడ లభిస్తే అక్కడికెళ్లి తాగుతున్నారు. తాజాగా వేములవాడ పట్టణానికి చెందిన అయిదుగురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని అరెస్టు చేయడంతో ఈ రాకెట్‌ మరోసారి వెలుగులోకి వచ్చింది. వీరు యువతే లక్ష్యంగా పెద్ద ఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్యామ్‌దివాకర్‌ అక్కడి నుంచి వేములవాడ ప్రాంతానికి తీసుకొచ్చి తమ స్నేహితులతో విక్రయాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గంజాయికి బానిసవుతున్న వారిలో ఎక్కువ శాతం యువత, చిన్నారులు, విద్యార్థులు, ఉండటం గమనార్హం.

యువత తల్లిదండ్రుల్లో ఆందోళన

కొంత మంది విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే గంజాయిని సరదా కోసం తాగి క్రమంగా బానిసలవుతున్నారు. తరవాత వారి ప్రవర్తనలో మార్పు కనిపించి జరిగిన విషయం తెలుసుకొని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విక్రయదారులు కొందరు విద్యార్థులు, యువతనే లక్ష్యంగా చేసుకొని దందాను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వేములవాడ పట్టణంలో సరఫరాదారులు చాలా మంది ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిని తాగిన యువత తమ ద్విచక్రవాహనాలను అతి వేగంగా నడిపిస్తూ రోడ్లపై వెళ్లే ఇతరులను భయాందోళనకు గురి చేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టకపోవడం వల్లే వీటి అమ్మకాలు విస్తరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నియంత్రణకు చర్యలు

గంజాయి సరఫరాను అరికట్టేందుకు నిఘా పెట్టడం జరిగింది. గంజాయి విక్రయించినా, తాగినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొంటాం. యువత గంజాయికి బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. తల్లిదండ్రులు వారి పిల్లలపై దృష్టి పెట్టాలి.

నాగేంద్రచారి, డీఎస్పీ, వేములవాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని