డ్రగ్స్ కేసులో నటి సంజనా, రాగిణిపై అభియోగపత్రాలు
రాగిణి
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడేే : మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు సంబంధించి సంజనా గల్రాని, రాగిణి ద్వివేది సహా 11 మందిపై బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు ఉన్నత న్యాయస్థానంలో 2,500 పుటల అదనపు అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. మూత్రం, రక్తం నమూనాలు బెంగళూరులో, శిరోజాలను పరీక్ష నిమిత్తం హైదరాబాద్ ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. ఆ రెండు ప్రయోగశాలల నివేదిక ఆధారంగా కథానాయికలు ఇద్దరూ మాదక ద్రవ్యాలను వినియోగించారని సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల సరఫరా చేసే లూమ్ పెప్పర్‌తో వీరిద్దరికీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. నగదు బదిలీ అంశాలున్న బ్యాంకు స్టేట్మెంట్లను పొందుపరిచారు. మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు ఇప్పటికే 1,500 పుటల అభియోగపత్రాన్ని న్యాయస్థానానికి దాఖలు చేశారు. తాజా అభియోగపత్రంతో కలిపి నాలుగు వేల పుటలు అయింది. మరో 1500 పుటల అభియోగపత్రాలను దాఖలుకు సీసీబీ సన్నాహకాలు చేపట్టింది.
ఠాణాలో సంజన
బెంగళూరు (మల్లేశ్వరం) : నమ్మిన వ్యక్తులే నా నుంచి నగదు తీసుకుని వంచించారని ఆరోపించిన నటి సంజనా గల్రాని, దీనికి సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్లు, నగదు బదిలీ వివరాలు అందించేందుకు ఇందిరానగర ఠాణాకు బుధవారం చేరుకున్నారు. గతంలో స్నేహితునిగా ఉన్న రాహుల్ తోన్సే అలియాస్ రాహుల్ శెట్టి, అతని సహచరులు రామకృష్ణ, రాఘవేశ్వరి తమకు నగదు ఇస్తే.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి, ఎక్కువ సంపాదిస్తామని, మీకు వాటా ఇస్తామని వంచించారని ఆమె కేసు పెట్టారు. తన పేరు అడ్డు పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేశారని సంజనా ఆరోపించారు. నగదు బదిలీకి సంబంధించిన వివరాలను పోలీసులకు సంజన అందించి, వెనుదిరిగారు.
నైజీరియన్‌కు కటకటాలు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడేే : మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఆరోపణలపై నైజీరియాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామని బెంగళూరు సీసీబీ జాయింటు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ ప్రకటించారు. రామమూర్తినగరలోని అతని నివాసం నుంచి రూ.20 లక్షల విలువైన ఎండీఎంఓ క్రిస్టల్స్, ఎక్స్టెన్సీ మాత్రలు బుధవారం స్వాధీనపరుచుకున్నారు. గోవా నుంచి తన అనుచరుల ద్వారా, పోలెండ్ నుంచి కొరియర్ ద్వారా మాదక ద్రవ్యాలు తెప్పించుకొంటున్నట్లు గుర్తించారు. అవసరం అయిన వారికి సరఫరా చేసేవాడని పాటిల్ తెలిపారు. ఇతనికి వ్యాపారంలో సహకరిస్తున్న ఇతర నిందితుల కోసం గాలింపు తీవ్రం చేశారు.