యువ రైతు ఉసురుతీసిన వాన
రైతు గాదిలింగప్ప (పాతచిత్రం)
కంప్లి, బళ్లారి, న్యూస్‌టుడే: అకాల వర్షాలతో సాగు చేసిన మిరప పంట పూర్తిగా దెబ్బతినడంతో...తట్టుకోలేని యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుగోడు తాలూకాలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతు గాదిలింగ(26), అలియస్ దరూరు గాదిలింగప్పగా గుర్తించారు. కురుగోడు తాలూకా బాధనహట్టి గ్రామానికి చెందిన రైతు గాదిలింగ సిద్దమ్మనహళ్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఒక ఎకరా రూ.35వేలు చొప్పున ఐదు ఎకరాలను కౌలుకు తీసుకొని మిరపను సాగు చేశాడు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పూర్తిగా నష్టపోయింది. పంట సాగుకు తన ఇళ్లను వేరే వ్యక్తులకు రూ.4లక్షలకు కుదువ పెట్టి అప్పు తీసుకున్నాడు. మరో రూ.2 లక్షలు ప్రైవేట్ వ్యక్తులతో అప్పు తీసుకున్నాడు. గురువారం భార్య, పిల్లలతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. అకాల వర్షం మిరప పంట పూర్తిగా నష్టపోవడంతో చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలని మనోవేదనకు గురయ్యాడు. భార్యాపిల్లల్ని పొలం వద్ద వదిలి ఇంటికి వచ్చి ఆయన పురుగుల మందు తాగాడు. అనంతరం ఇంటికి వచ్చిన భార్య గుర్తించి తక్షణమే కురుగోడు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్‌కు తరించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న కురుగోడు పోలీసులు, అధికారులు విమ్స్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యుడు సురేష్‌బాబు విమ్స్‌కు చేరుకొని రైతు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కుటుంబానికి రూ.10వేలు నగదు అందజేసి, ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.