
ప్రసంగిస్తున్న ఎన్నికల పరిశీలన అధికారి డా.వి.రామ్‌ప్రసాత్
మనోహర్, చిత్రంలో డీసీ, ఎస్పీ, సీఈవో తదితరులు
బళ్లారి, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల కోటా కింద నిర్వహిస్తున్న బళ్లారి విధానపరిషత్ ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విధానపరిషత్ ఎన్నికల పరిశీలన అధికారి, గని, భూవిజ్ఞాన శాఖ నిర్దేశకుడు డా.వి.రామ్ ప్రసాత్ మనోహర్ కోరారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు, సూచనల మేరకు న్యాయబద్ధంగా నిర్వహించాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు వరకు అనుభవజ్ఞులైన అధికారులను నియమించాలన్నారు. ఎన్నికల్లో చిన్నా..పెద్ద తేడా లేకుండా చూడాలి. ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని డీసీకి సూచించారు. ఎన్నికలను అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా, అత్యంత కట్టుదిట్టంగా విధులను నిర్వహించాలి. పార్టీలు, అభ్యర్థులకు అనుకూలంగా నడుచుకున్నట్లు గుర్తిస్తే వారిని నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తామని గట్టిగా హెచ్చరించారు. జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్ మాలపాటి మాట్లాడుతూ బళ్లారి విజయనగర జిల్లాలో ఎన్నికలకు సబంధించిన నిర్వహణ, ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో జిల్లా పోలీస్ అధికారి సైదులు అడావత్, జిల్లా పంచాయతీ సీఈవో కె.ఆర్.నందిని, ఏడీసీ మంజునాథ, పాలికె కమిషనర్ ప్రీతి గెహ్లాట్, బళ్లారి ఉప విభాగం కమిషనర్ డా.ఆకాశ శంకర్ పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన అధికారులు