logo
Published : 27 Nov 2021 01:11 IST

కొత్త వైరస్ తో కలకలం

చాపకింద నీరులా ముప్పు

నోరో వైరస్‌పై అప్రమత్తం

మహా ప్రమాదం : ధార్వాడలో కరోనా ప్రబలిన ఎస్‌డీఎం

వైద్య కళాశాలను శుక్రవారం మూసివేసి భద్రత కల్పిస్తున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌, బెంగలూరు : కరోనా మూడో దశ అనే అంశంపై బెంగలేదని వైరాలజిస్ట్‌లు, ఆరోగ్య అధికారులు కూడా తేల్చి చెబుతున్నా.. భయం మాత్రం పొంచే ఉంది. సెప్టెంబరులో బెంగళూరులోని ఓ విద్యా సంస్థలో 30 మంది విద్యార్థులు ఏకకాలంలో కరోనా బారినపడినట్లు వచ్చిన సమాచారంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆపై కాస్త సద్దుమణిగినా తాజాగా ధార్వాడలోని ఎస్‌డీఎం వైద్య కళాశాల కరోనా కేసులకు అడ్డాగా మారింది. ఆ కళాశాల విద్యార్థులు, సిబ్బంది మొత్తం మూడు వేల మంది ఉండగా.. అక్కడికి చికిత్సకు వచ్చిన వారిలోనూ ఆందోళన మొదలైంది. శుక్రవారానికి 182 మందికి కరోనా నిర్ధరణ కాగా ఇంకా వెయ్యి మంది నివేదికలు రావాలి. ఈ సంఘటనపై చర్చ జరుగుతుండగానే బెంగళూరులోని మరో పాఠశాలకు చెందిన 33 మంది విద్యార్థులు ఓ బోధన సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తేలింది. దక్షిణాఫ్రికా, హాంక్‌కాంగ్‌లను కొత్త వైరస్‌ వణికిస్తుందన్న అంతర్జాతీయ వార్తలు భీతిగొలుపుతున్న దశలో కర్ణాటకలోని ఈ రెండు సంఘటనలు మరింత ఆందోళన పెంచాయి.

నిర్లక్ష్యమే ప్రమాదం

కరోనా పేరు చెబితే భయపడే వారి సంఖ్య దాదాపు తగ్గింది. మాస్కుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. పాత వైరస్‌ రకం తన ప్రభావాన్ని తగ్గించుకున్నా కొత్త వైరస్‌ దాడిని కొట్టిపారేయలేమని కర్ణాటక ప్రభుత్వ కరోనా టాస్క్‌ఫోర్స్‌ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతానికి మూడో దశ కరోనా దాదాపు లేనట్లేనని ధీమాగా ఉండలేమని ఈ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, వైరాలజీ నిపుణుడు డాక్టర్‌ దినేశ్‌రావ్‌ హెచ్చరించారు. ఇందుకు కారణం బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, హాంక్‌కాంగ్‌లో వెలుగుచూసిన బి.1.1529రకానికి చెందిన కరోనా వైరస్‌. ప్రస్తుత వైరస్‌ రకానికి దాదాపు ఆరు రెట్ల జన్యుమార్పును సంతరించుకుంది. కొత్త వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

అదిగో ముప్పు

అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే బెంగళూరుకు కొత్తరకం వైరస్‌ ముప్పు పొంచి ఉన్నట్లు ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ప్రయాణికులపై నిషేధం లేకున్నా అత్యంత వేగంగా వ్యాప్తిచెందే కొత్త రకం వైరస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.

కేరళలో ఇప్పటికే గుర్తించిన నోరో వైరస్‌ పట్ల రాష్ట్రం అప్రమత్తమైంది. కేరళ సరిహద్దు జిల్లాలైన కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల రాకపోకలపై ఆంక్షలు జారీ చేయాలని రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖలు తీర్మానించాయి. ఈ జిల్లాల్లో ప్రత్యేక వైద్య సిబ్బందిని నోరో వైరస్‌ చికిత్సల కోసం ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల ఆరోగ్య శాఖల అధికారులకు సర్కారు ఆదేశించింది. ఈ అరుదైన వైరస్‌ వాంతులు, విరోచనాలు, జలుబు, తలనొప్పి, కీళ్ల నొప్పులతో కరోనాకు మించిన ఆరోగ్య సమస్యలను సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కేసుల తీవ్రత

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కర్ణాటకలో శుక్రవారం 402 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం 277 మంది ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. క్రియాశీలక కేసుల సంఖ్య 6,611కు పెరిగింది. పాజిటివిటీ 0.60 శాతం, మరణాలు 1.49 శాతంగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3.23 లక్షల మంది శుక్రవారం టీకా వేయించుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో 66,805 మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.

కొత్త మార్గదర్శకాలివిగో

పరీక్షలే కాదు క్వారంటైన్‌ కూడా తప్పనిసరేనా

రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా మార్గదర్శకాలను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బి.1.1529 వైరస్‌ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చేయటమే సర్కారు లక్ష్యమని ప్రకటించింది. ఇందులో భాగంగా విదేశీ ప్రయాణికులపై అత్యంత సునిశితమైన నిఘా ఉంచాలని తీర్మానించారు. ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్‌ ఉన్నా వెంటనే వాటిని ఐజీఎస్‌ఎల్‌ ప్రయోగశాల (ఇన్‌సాకాగ్‌ జినోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్ష)కు పంపాలని అధికారులు తీర్మానించారు. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్‌ దేశాల నుంచి వచ్చేవారిని నేరుగా నగరంలోనికి ప్రవేశించనీకుండా నియంత్రించాలని తీర్మానించారు. ఈ దేశాల వారి నమూనాలను నేరుగా ఐజీఎస్‌ఎల్‌ ప్రయోగశాలకు పంపాలని అంతర్జాతీయ విమానాశ్రయాల వ్యవస్థలకు సూచనలిచ్చారు. జిల్లా యంత్రాంగానికి కూడా వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌(వీఓసీ), వేరియంట్స్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌(వీఓఐ) విధానాలు అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్‌ శుక్రవారం ఆదేశించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని