అక్క హత్య వెనుక తమ్ముడి హస్తం
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఆస్తి కోసం ఏడు నెలల కిందట సీత (47) అనే మహిళను హత్య చేయించిన వెంకటేశ్ ఆచార్ (44) కోసం రాజాజీనగర పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మంత్రాలయానికి చెందిన సీత బెంగళూరులో ఉండేవారు. మార్చి 23 నుంచి ఆమె కనిపించడం లేదని వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా సత్య అనే యువకుడిని అరెస్టు చేశారు. విచారణలో తన అక్క హత్యకు వెంకటేశ్ స్వయంగా కిరాయి ఇచ్చాడని గుర్తించారు. దర్యాప్తు అధికారులు గుర్తించిన సమాచారం ప్రకారం.. మంత్రాలయంలో ఉన్న స్థలాన్ని విక్రయించేందుకు వెంకటేశ్ ప్రయత్నించగా.. ఆ పత్రాలపై సంతకం పెట్టేందుకు ఆమె నిరాకరించింది. ఆమెను హత్య చేసేందుకు నూర్ అహ్మద్, సత్య, కుమార్, రఘు అలియాస్ మెంటల్ రఘుకు రూ.2.5 లక్షల కిరాయి ఇచ్చాడు. బంగారం కొనుగోలు చేయాలని అక్కను తీసుకుని, నిందితులతో కలిసి కారులో హాసనకు తీసుకు వెళ్లాడు. తలనొప్పి ఉందన్న అక్కకు సైనేడ్ కలిపిన మాత్రను ఇచ్చాడు. దాన్ని వేసుకున్న ఆమె క్షణాల్లో మరణించింది. హొసకోటె సమీపంలోని కాలువలో ఆమె మృతదేహాన్ని పడేసి నిందితులు పరారయ్యారు. సత్యను, నూర్ అహ్మద్‌లను అరెస్టు చేసి, వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ తీవ్రం చేశారు. కుమార్, రఘు అలియాస్ మెంటల్ రఘు కొన్ని వారాల కిందటే అనారోగ్యంతో మరణించారని పోలీసులు తెలిపారు.