ధర పతనంతో అరటి రైతు గగ్గోలు
హొసూరులో తక్కువ ధరకే అరటి గెలలను లోడు చేస్తున్న రైతులు
హొసపేటె, న్యూస్టుడే: ఒకవైపు తుపాను వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో వైపు వాణిజ్య పంట అరటి ధర కూడా పూర్తిగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. హొసపేటె గ్రామీణ ప్రాంతం, హంపీ, కమలాపుర, వెంకటాపుర, బుక్కసాగర, కంప్లి తాలూకాలో పెద్ద ఎత్తున అరటి పండిస్తున్నారు. 11 నెలలు పారే విజయనగర కాలువల కింద ముందు నుంచి రైతులు అరటినే పండిస్తున్నారు. ఈసారి అరటి ధర దారుణంగా పడిపోయింది. కంప్లి, చిత్తవాడ్గీ, మునిరాబాద్లోని చక్కెర మిల్లులు మూతపడినందున ఎక్కువ మంది రైతులు అరటివైపు మొగ్గు చూపారు. ఆశించినంత ఆదాయం చేతికందక దిగాలు పడుతున్నారు. వినాయక చవితి, విజయదశమి, దీపావళి పండగల వరకూ అరటి ధర కిలో రూ.48 ఉండేది. అప్పటి నుంచి అకాల వర్షాలు కురవడంతో అరటి రైతులు, వ్యాపారులను పలకరించేవారే కరవయ్యారు. రోజూ వాహనాల్లో ఏపీఎంసీ యార్డుకు గెలలను తీసుకొస్తున్న రైతులకు ధరలతో నిరాశే మిగులుతోంది. సుగంధి రకం కిలో రూ.20, పచ్చపసుపు రూ.15, యాలకుల రకం రూ.15దాకా పలుకుతున్నాయి. దీంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులు, దళారులు మంచి ధరలకు విక్రయించి లాభాలు కళ్లజూస్తున్నారు. అరటి పండించిన రైతు మాత్రం పడిపోయిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎకరా పొలంలో ఈపంట పండించాలంటే కనీసం రూ.1.2 లక్షల దాకా పెట్టుబడి అవసరం. ధర పడిపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని హొసపేటె రైతులు గంగాధర, చెన్నబసవరాజ్లు వాపోయారు.