కలబురగి కమిషనర్‌పై ప్రధానికి ఫిర్యాదు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : వివాహం చేసుకుంటానని నమ్మించి కర్ణాటక కేడర్ ఐఏఎస్ యువ అధికారి స్నేహల్ లోఖండె తనను వంచించాడని దిల్లీకి చెందిన ఓ యువతి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి నేరుగా ఫిర్యాదు చేయడంతో శనివారం కలకలం రేగింది. స్నేహల్ ప్రస్తుతం కలబురగి మహానగర పాలికె కమిషనర్‌గా సేవలు అందిస్తున్నారు. పలువురు ఇతర ప్రముఖులకూ ఆమె లేఖలు రాయడంతో అన్ని వైపుల నుంచి స్పందన మొదలైంది. తన ట్విటర్ ఖాతాలో కొందరు నాయకులకు హ్యాష్ టాగ్ చేసి ఆరోపణలు సంధించింది. దిల్లీలో తనకు స్నేహల్‌తో పరిచయమైందని, అది కాస్త ప్రేమగా మారిందని ఆ యువతి వివరించింది. కర్ణాటక నుంచి ఆయన దిల్లీ వచ్చిన ప్రతిసారీ తనను హోటల్‌కు పిలిపించుకుని సన్నిహితంగా ఉండేవాడని వివరించింది. చివరి సారి తాను 2019 మే 26న ఆయనతో కలిసి మూడు రోజులు హోటల్లో ఉన్నానని ఆ సమాచార వేదికలో వెల్లడించింది. ఇప్పుడు తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని యువతి ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారితో తాను చేసిన వాట్సప్ చాటింగ్‌ల స్క్రీన్ షాట్లను ఆమె ఫిర్యాదుతో జత చేసింది. స్నేహల్ యుపీఎస్సీ పరీక్ష రాస్తున్నప్పుడే ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని ఆమె తెలిపింది. ఆమె ఆరోపణలను స్నేహల్ ఖండించారు. ఆమెపై తాను హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నానని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుకు అధికారి ఇప్పటికే స్పందించారని, చట్టానికి అనుగుణంగా దర్యాప్తు, విచారణ కొనసాగుతాయని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.