‘పల్లె నుంలి దిల్లీ వరకూ భాజపా ఉండాలి’
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న మంత్రి ఆనంద్‌సింగ్
హొసపేటె, న్యూస్‌టుడే: పల్లె నుంచి దిల్లీ వరకూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలన్న జాతీయ నాయకుల అభిమతాన్ని నెరవేర్చేందుకు కార్యకర్తలు కృషిచేయాలని బళ్లారి జిల్లా బాధ్యమంత్రి ఆనంద్‌సింగ్ కోరారు. విజయనగర జిల్లా కూడ్లిగిలో శనివారం ఆయన బళ్లారి ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా జనరంజక పాలన అందిస్తోంది. ఆ పాలన చూసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు భాజపా అభ్యర్థుల్ని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి బి.శ్రీరాములు మాట్లాడుతూ గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కూడ్లిగి ప్రజలు భాజపాకు ఆధిక్యం ఇచ్చారు. ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరారు. శాసనసభ్యుడు ఎన్.వై.గోపాలకృష్ణ, అభ్యర్థి వై.ఎం.సతీశ్, మాజీ ఎంపీ జె.శాంత, జిల్లా అధ్యక్షుడు చెన్నబసవనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
భాజపా నేతల ప్రచారం
బళ్లారి: విధానపరిషత్ క్షేత్రం భాజపా అభ్యర్థి ఏచరెడ్డి సతీష్ తరఫున బళ్లారి నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ సణ్ణ పక్కీరప్ప, రైతు మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురులింగనగౌడ, పార్టీ నాయకులు మల్లికార్జునగౌడ, ప్రకాష్, లోకేష్‌రెడ్డి, ఓంప్రకాశ్ తదితరులు ప్రచారం తీవ్రం చేశారు. సంగనకల్లు, వణేనూరు, యర్రగుడి, సింధవాళ, కారేకల్లు, శిడిగినమోళ, చెళ్లగుర్కి తదితర గ్రామ పంచాయతీల్లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులతో సమావేశం నిర్వహించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలను చూసి భాజపా అభ్యర్థి ఏచరెడ్డి సతీష్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
సంగనకల్లులో మాట్లాడుతున్న గాలి సోమశేఖర్‌రెడ్డి