
బొమ్మైతో చర్చిస్తున్న వ్యవసాయ మంత్రి బి.సి.పాటిల్
హుబ్బళ్లి, న్యూస్టుడే : రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం నగరానికి వచ్చిన ఆయన విధానపరిషత్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ కఠిన చర్యల్ని తీసుకున్నా లాక్డౌన్ను విధించాలనే ఆలోచన లేదని పునరుద్ఘాటించారు. గతంలోనూ విదేశీయుల నుంచే కరోనా ప్రబలిన నేపథ్యంలో ఈసారి అలాంటి ఇబ్బందికి అవకాశం లేకుండా వారికి పూర్తి వైద్య పరీక్షల్ని నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు అనుమతిపై తుది నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేరళ, మహారాష్ట్రల నుంచి రాష్ట్రంలో ప్రవేశించేవారికి వైద్య పరీక్షల్ని తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు.