logo
Updated : 02/12/2021 06:39 IST

బూస్టర్ కోసం  ఢిల్లీ యాత్ర 


 పోలీసుల సాయంతో దావణగెరెలో టీకా ప్రక్రియ కొనసాగింపు

ఈనాడు డిజిటల్, బెంగళూరు : సర్కారు రూపొందించిన కరోనా కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమలులోనికి వచ్చాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్, క్వారంటైన్, ప్రత్యేక వార్డుల్లో చికిత్సలందించే వ్యవస్థలను ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలపై వస్తున్న వదంతులపై విచారణకు ఆయన ఆదేశించారు. అందరికీ సులువైన వైద్యం అందించాలంటే దూర వైద్య సేవలను ముమ్మరం చేయాలని తీర్మానించారు. జిల్లా ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థను ఏర్పాట చేయాలని నిర్ణయించారు. ఒమిక్రాన్‌ బాధితులకు ఇచ్చే చికిత్సల కోసం జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశాఖ సమన్వయ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. పిల్లలపై ఒమిక్రాన్‌ ప్రభావంపై ఇంకా స్పష్టత లేకపోవటంతో వీరికి టీకా వితరణపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. ఓ వైపు కరోనా కొత్త రూపం.. ఒమిక్రాన్‌పై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ చర్యల్లో టీకా వితరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని భావించిన సర్కారు దాన్ని నిర్లక్ష్యం చేసిన వారిపై దృష్టి సారించింది. రెండో డోసు వద్దనే వారి వివరాలను ఆరోగ్యశాఖ సిద్ధం చేసి కార్యాచరణ రూపొందించుకుంటోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పెరిగిన ఆంక్షల నేపథ్యంలో అక్కడి సిబ్బంది ప్రయాణికులను వేధిస్తున్నారన్న సమాచారంతో సర్కారు విచారణ ప్రారంభించింది. పెరుగుతున్న కరోనా క్లస్టర్లపై నిఘా పెంచి ఆ ప్రాంతాల్లో వైద్య సేవలు సులువుగా అందించే ఏర్పాటు చేసింది.
బూస్టర్‌ కోసం..
కొత్త వైరస్‌ తీవ్రమైతే వైద్య చికిత్సలు వేగవంతం కావాల్సిందే. ప్రజారోగ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పరిరక్షిచాలంటే ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోలీసు యంత్రాంగం, ఆశా కార్యకర్తల సేవలు ఎంతో కీలకం. వీరి ఆరోగ్య భద్రత సర్కారు కర్తవ్యం కూడా. కరోనా యోధుల విభాగంలో ఉండే వీరికి ఇప్పటికే రెండు డోసులు వేశారు. రెండో డోసు స్వీకరించిన వారికి బూస్టర్‌ డోసు వేయాలని సర్కారు తీర్మానించింది. దాదాపు ఆరు నెలల కిందటే రెండో డోసు పూర్తి చేసుకున్న వారికి వీలైనంత త్వరగా ‘బూస్టర్‌’ అవసరమని కరోనా సాంకేతిక సలహా సమితి సూచించింది. ఇందు కోసం కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అనుమతి పొందేందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. బూస్టర్‌ డోసుతో పాటు 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ వేసే విషయంపై ఈ పర్యటనలో స్పష్టత రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షల మంది కరోనా యోధులకు బూస్టర్‌ డోసు వేయాలి.

అవగాహన ముఖ్యం
రెండు డోసులు తీసుకోకుంటే సర్కారు సదుపాయాలకు అనర్హులన్న నిబంధనపై సర్కారు పునరాలోచించింది. ఉన్నపళంగా ఈ నిబంధనతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బుధవారం అభిప్రాయపడ్డారు. నిబంధనల కంటే టీకా ఆవశ్యకతపై అవగాహన కల్పించటం ముఖ్యమన్నారు. ఇందు కోసం ఆయా జిల్లా ఆస్పత్రుల సిబ్బంది, ఆశా కార్యర్తలతో ‘లసికా మిత్ర’ పేరిట ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి కొత్త వైరస్‌పై అపోహలను నివృత్తి చేయాల్సి ఉందన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం ఆచరణలపై ఎలాంటి నిబంధనలు సిద్ధం చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా, అంతర్జాతీయ ప్రయాణికులను వారం రోజుల పాటు పర్యవేక్షించేందుకు అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు.
పెరుగుతున్న క్లస్టర్లు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా క్లస్టర్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ధార్వాడ, తుమకూరు, చామరాజనగర, ఆనేకల్, హాసన, బెంగళూరు నగర, గ్రామీణల్లో కరోనా క్లస్టర్లు పెరుగుతున్నాయి. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారినపడుతున్నట్లు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రకటించింది. బుధవారం తుమకూరులోని నర్సింగ్‌ కళాశాలలో కరోనా బాధిత విద్యార్థుల సంఖ్య 25కు చేరుకోగా, ధార్వాడ ఎస్‌డీఎంలో నాలుగు వేల మందికి పరీక్షలు చేపట్టగా 350 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఆనేకల్‌లోని ఓ మోడల్‌ స్కూల్‌లో 30 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఈ క్లస్టర్లున్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. నిత్యం ఐదు శాతానికి మించి కరోనా కేసులు నమోదవుతుంటే లాక్‌డౌన్‌ విషయంపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది.
వారంతా ఎక్కడ?
ఒమిక్రాన్‌ ప్రబలిన దేశాల నుంచి గడచిన పక్షం రోజుల్లో 430 మంది బెంగళూరు విమానాశ్రయం చేరుకున్నారని తేలింది. వీరిలో వంద మంది మాత్రమే పరీక్షలు చేయించుకున్నట్లు ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ గుర్తుచేసింది. మిగిలిన వారి విషయమేంటని ప్రశ్నించింది. వీరి ఆరోపణలకు సమాధానమిచ్చిన ఆరోగ్యశాఖ అధికారులు.. వీరి చిరునామాలు, ఫోన్‌ నంబర్లను గుర్తించి వారి ఆరోగ్యంపై ఆరా తీస్తామన్నారు. గతంలో నిర్వహించిన క్వారంటైన్‌ యాప్‌తో ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తామని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఘటనపై స్పందన
బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : బెంగళూరులోని ఈఎస్‌ఐ ఆసుపత్రి శవాగారంలో రెండు మృతదేహాలను 15 నెలలు నిర్లక్ష్యంగా వదిలి వేసిన ఘటన బయటకు వచ్చిన వెంటనే ఆసుపత్రి డీన్‌ జితేంద్ర కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త డీన్‌గా డాక్టర్‌ రేణుకా రామయ్యను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిరుడు జులైలో కొవిడ్‌కు చికిత్స పొందుతూ మరణించిన చామరాజపేట, కె.పి.అగ్రహారకు చెందిన వ్యక్తుల మృతదేహాలను మార్చురీలోనే వదిలి వేసినట్లు కొద్ది రోజుల కిందటే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
విమాన ప్రయాణ నిబంధనావళి సిద్ధం
బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : విదేశీ ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా ‘ఎయిర్‌ సువిధ’ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ‘రెండు వారాల్లో వారు ప్రయాణ వివరాలను ఆ పోర్టల్‌లో పొందుపరచాలి. ప్రయాణానికి 72 గంటల ముందుగా చేయించుకున్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ నివేదికను అప్‌లోడ్‌ చేయడమూ తప్పనిసరి. ఆరోగ్యంగా ఉన్నామని స్వీయ పత్రాన్ని దాఖలు చేయకపోతే, అధికారులు ఆ ప్రయాణికులపై క్రిమినల్‌ కేసులను నమోదు చేసే ప్రమాదాన్ని గుర్తించాలి. ప్రయాణ సమయంలో విమానయాన, విమానాశ్రయ, ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు తు.చ. తప్పకుండా అనుసరించాల్సిందే’అని అధికారులు నియమావళిలో పేర్కొన్నారు.

విదేశీయులపై నిఘా
బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులందరికీ తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సిబ్బంది పరీక్షించే విధానాన్ని బెంగళూరు గ్రామీణ విభాగం జిల్లాధికారి శ్రీనివాస్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి పరీక్షించారు. దక్షిణాఫ్రికాతో కలిపి పన్నెండు దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై నిఘా మరింత పెంచామన్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని బౌరింగ్‌ ఆసుపత్రికి, ఇతరులను ఇళ్లలోనే క్వారంటైన్‌ ఉండాలని సూచించి పంపిస్తున్నామని తెలిపారు. ఇళ్లలో క్వారంటైన్‌లో ఉన్న వారిపైనా పాలికె సిబ్బంది నిఘా పెడతారని చెప్పారు. 
కాస్త పెరిగిన కేసులు
కర్ణాటకలో బుధవారం 322 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 162 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. మరో ఇద్దరు మరణించారు. క్రియాశీల కేసుల సంఖ్య 6,574కు చేరుకున్నాయి. పాజిటివిటీ 0.31 శాతం, మరణాలు 0.62 శాతంగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7.32 లక్షల మంది బుధవారం టీకా వేయించుకున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో 1.01 లక్షల మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు.  

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని