logo
Published : 03 Dec 2021 01:29 IST

ఇసుక అక్రమాన్ని అడ్డుకున్న అధికారి ఇంటిపై దాడి

ఐదుగురికి తీవ్ర గాయాలు

జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద ఉద్యోగుల ఆందోళన

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి తాలూకాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వెంకటస్వామి అనే గ్రామ లెక్కాధికారి ఇంటిపై దుండగులు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన అతని భార్య, ఆమె చెల్లెలు, కుమారులను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన బుధవారం రాత్రి బళ్లారిలో జరిగింది. బాధితులు విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన వివరాలివి.. బళ్లారి తాలూకా రూపనగుడి ఫిర్కాలోని తూలమామిడి గ్రామపంచాయతీ పరిధిలోని హగరి (వేదావతి) నది నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామ లెక్కాధికారి వెంకటస్వామి, సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. దీంతో వారు వెంకటస్వామి, ఇతరులపై దాడి చేశారు. వారి దాడులను లెక్క చేయకుండా అధికారి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని బళ్లారి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక మిల్లర్‌పేటెలో వెంకటస్వామి నివాసం ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మక్బూల్‌, రఫీక్‌, ఇలియాస్‌ తదితరులు సుమారు 20 నుంచి 30 మంది బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో మారణాయుధాలతో అతని ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో వెంకటస్వామి చేయికి బలమైన గాయాలయ్యాయి. దాడిని అడ్డుకోవడానికి వచ్చిన అధికారి భార్య, ఇద్దరు కుమారులు, మరదలినీ గాయపరిచారు. దాడివిషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ వెంటనే ఎస్పీ సైదులు అడావత్‌కు ఫోన్‌ చేసి నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. పోలీస్‌ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన ఐదుగురినీ విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. బ్రూస్‌పేటె పోలీసులు కేసు నమోదు చేసి నిందితులలో నలుగురిని అరెస్టు చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

గాయపడిన వెంకటస్వామి దంపతులు

పోలీసులకు ఫిర్యాదు

ఇసుక తరలిస్తున్న విషయం తెలిసిన వెంటనే తూలమామిడి, కుంటనాళ్‌ గ్రామ లెక్కాధికారులు జె.గణేష్‌, హళ్లి మంజునాథ్‌, గని భూవిజ్ఞాన శాఖ అధికారులతో కలిసి వెళ్లగా, ఘటన స్థలంలోనే జె.గణేష్‌పై దాడి చేశారు. మరో ట్రాక్టర్‌ అక్కడ నుంచి మాయమైందని గ్రామలెక్కాధికారి వెంకటస్వామి బళ్లారి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇసుక మాఫియాకు కళ్లెం వేస్తాం: డీసీ

అక్రమాన్ని అడ్డుకున్న వెంకటస్వామి, అతని కుటుంబసభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. విమ్స్‌లో బాధితులను పరామర్శించాను. తమ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఉద్యోగులతోనూ మాట్లాడాను. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి అధికారుల బృందంతో సమన్వయ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు తనను కలిసిన విలేకరులకు డీసీ తెలిపారు. ప్రస్తుతం సిరుగుప్ప తాలూకాలో మాత్రమే ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. బళ్లారి తాలూకాలోనూ రెండు కేంద్రాలను గుర్తించాం. కొన్ని శాఖల అనుమతి కోసం చూస్తున్నాం. త్వరలోనే మరో రెండు నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇసుక కొరత ఉండదన్నారు.

విమ్స్‌లో బాధితులతో మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌

ఖండన

ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామలెక్కాధికారి వెంకటస్వామి కుటుంబంపై దాడిని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివాజీరావు, మాజీ అధ్యక్షుడు డా.మల్లేశప్ప, కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

నిందితులపై చర్యకు డిమాండ్‌

విజయనగర అదనపు పాలనాధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న ఉద్యోగులు

హొసపేటె: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవటానికి వెళ్లిన బళ్లారి తాలూకా రూపనగుడి గ్రామ లెక్కాధికారి వెంకటస్వామి, కుటుంబ సభ్యులపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విజయనగర రెవెన్యూ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అందానప్ప దానప్పగౌడ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడలు డిమాండ్‌ చేశారు. విజయనగర జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద గురువారం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నేతృత్వం వహించిన అధ్యక్షుడు అందానప్ప మాట్లాడుతూ బళ్లారి తాలూకా తొలమామిడిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకోవటానికి వెళ్లిన వెంకటస్వామిపై ఇసుక రవాణాదారులు దాడి చేశారు. రాత్రి సుమారు 20 మంది పురుషులు, మహిళలు ఇంట్లో చొరబడి ఆర్‌.ఐ, అతని భార్యపైనా దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు నిర్భయంగా పనిచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అదనపు జిల్లా పాలనాధికారి మహేశ్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని