logo
Published : 03/12/2021 01:29 IST

ప్ఛ్‌.! కంతు చెల్లిస్తే బాగుండేది!!

 చేతులు కాలాక ఆకులు పట్టిన చందం

 పంటల బీమా అందక రైతుల పశ్చాత్తాపం

లక్ష్మీనగర్‌ క్యాంపులో దెబ్బతిన్న మిరప పంట

బళ్లారి, న్యూస్‌టుడే: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు, దుర్భిక్ష పరిస్థితులతో పంటలు నష్టపోతే బీమా అందుతుందని, ప్రతి రైతు పంటల బీమా కంతు చెల్లించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు అవగాహన కల్పించినా రైతులు ఉదాసీనత కనబరిచారు. ఇప్పుడది చేదు అనుభవంగా మిగిలిపోయింది. అకాల వర్షాలకు జిల్లాలో సుమారు రూ.1,700 కోట్ల పంటనష్టం వాటిల్లింది. ఇలాంటి సమయంలో రైతులకు పంటల బీమా సొమ్ము అందేది. బీమా కంతు చెల్లించక తప్పుచేశామంటూ ఇప్పుడు రైతులు పశ్చాత్తాప పడుతున్నారు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు నుంచి వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు పంటల బీమాపై రైతులకు తాలూకాలు, ఫిర్కాల వారీగా అవగాహన కల్పిస్తుంటారు. ఈ ఏడాది ఆయకట్టు కింద, బోరుబావులు, నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు 70 వేల హెక్టార్లలో మిరప సాగు చేశారు. లక్ష ఎకరాలకుపైగా వరి వేశారు. పంటల బీమా కంతు చెల్లించకపోవడంతో ఆ డబ్బు అందుకోలేకపోయారు.

మిరపకు 179 మంది మాత్రమే కంతుల చెల్లింపు

అఖండ బళ్లారి జిల్లాలో దాదాపు 30 వేల మంది రైతులు మొత్తం 70 వేల హెక్టార్లలో మిరప సాగు చేశారు. ఇందులో బీమా కంతు చెల్లించింది కేవలం 179 మంది. అకాల వర్షాలతో 1.06 లక్షల ఎకరాల్లో మిరప పంటకు నష్టం జరిగింది. ఎకరానికి రైతు కౌలు, ఇతర పెట్టుబడి ఖర్చులు రూ.1.20 లక్షల వరకు పెట్టారు. మిరప రైతులు ఎకరానికి రూ.4,600 పంటల బీమా కంతు చెల్లించి ఉంటే నష్టపోయినపుడు బీమా సంస్థ రూ.96 వేలు చెల్లిస్తుంది. పంట నష్టం విషయం తెలిసిన వెంటనే ప్రాథమిక పరిశీలన జరిపి నాలుగో వంతు, అనంతరం విడతల వారీగా మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఉల్లి రైతులు 803 మంది, టమోట రైతులు తొమ్మిది మంది మాత్రమే పంటలకు బీమా చేయించారు.

కప్పగల్‌లో మొలకలు వచ్చిన మొక్కజొన్న కంకులు (దాచిన చిత్రాలు)

1,586 మంది వరి రైతులు

ఖరీఫ్‌ వరి సాగు చేసిన రైతుల్లో కేవలం 1,586 మంది పంటల బీమా కంతు చెల్లించారు. ప్రస్తుతం వర్షాలకు వరి తీవ్రంగా దెబ్బతినడంతో బీమా మొత్తం అందుకోలేక విలవిలలాడుతున్నారు. ఆయకట్టు, బోరుబావులు, నది పరివాహక ప్రాంతాల్లో సుమారు లక్ష హెక్టార్లలో వరిని సాగు చేశారు. 1,586 మంది రైతులు ఎకరానికి రూ.696 చెల్లించి బీమా చేయించుకున్నారు. వరి పంట పూర్తిగా నష్టపోయిన ఇలాంటివారికి రూ.34 వేలు అందుతుంది. మొక్కజొన్న సాగు చేసిన రైతుల్లో 8,425 మంది రైతులు ఎకరానికి రూ.478 చెల్లించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేలు వస్తుంది. పత్తి సాగు చేసిన రైతులు 372 మంది పంట బీమా కంతు ఎకరానికి రూ.1,356 చెల్లించారు. పూర్తిగా నష్టపోయిన వారికి ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందుకుంటారు.

ఇకనైనా రైతులు మేల్కోవాలి

పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. ఖరీఫ్‌, రబీలో రైతులు తప్పనిసరిగా పంట బీమా కంతు చెల్లించాలి. ప్రస్తుతం అకాల వర్షాలతో మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటల బీమా కంతు చెల్లించి ఉంటే పరిహారం కొంతవరకు ఉపకరించేది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు మేల్కోవాలి.-పవన్‌కుమార్‌, జిల్లా పాలనాధికారి

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని