logo

Omicron: ఆ నలుగురూ.. ఏమయ్యారు?

ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి బెంగళూరుకు వచ్చి.. కనిపించకుండా పోయిన పది మందిలో ఆరుగురి వివరాలు అందుబాటులోకి రావడంతో అధికారులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. మరో నలుగురి జాడ కోసం వేట కొనసాగిస్తున్నారు. పోలీసులు- బెంగళూరు పాలికె అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated : 05 Dec 2021 09:55 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి బెంగళూరుకు వచ్చి.. కనిపించకుండా పోయిన పది మందిలో ఆరుగురి వివరాలు అందుబాటులోకి రావడంతో అధికారులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. మరో నలుగురి జాడ కోసం వేట కొనసాగిస్తున్నారు. పోలీసులు- బెంగళూరు పాలికె అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ నలుగురూ చరవాణిలు పని చేయకుండా ఆపేశారని తేలింది. అందులో ముగ్గురి వివరాలు త్వరలోనే తెలిసిపోతాయని భావిస్తున్నారు. ఆ దిశగా సాంకేతిక శోధన సాగుతోంది. పరారీలో ఉన్న వ్యక్తులు ఎంత మందికి ఒమిక్రాన్‌ వైరస్‌ను సోకేలా చేస్తారోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019 మార్చిలో కరోనా వైరస్‌ నగరంలో గుర్తించిన సమయంలోనూ ఇలాంటి ‘పరారీ’ ఘటనలు వెలుగు చూడటం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన 20 మంది వివరాలు అప్పట్లో లభించక కలకలం రేగింది. వారి కారణంగానే కరోనా వైరస్‌ వేగంగా వ్యాపించింది. గతం నుంచి పాలికె అధికారులు పాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒమిక్రాన్‌ వైరస్‌ నగరంలో ఉనికిచాటి మూడు రోజులు గడిచినా నియంత్రణకు పాలికె అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. ఆ వివరాలన్నీ కాగితాలు, సభల్లో చర్చకే పరిమతమవుతున్నాయి. నగరంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తించిన వెంటనే జేపీనగర, కోణనకుంటె, కోరమంగల, హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్‌లో ఆరు ఇళ్లను సీల్‌డౌన్‌ చేశారు. అందుకు దారితీసిన కారణాలు, వాస్తవాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* దక్షిణాఫ్రికా నుంచి నగరానికి వచ్చిన కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి దుబాయికి వెళ్లేందుకు వసంతనగరలో ఉన్న పంచతారా హోటల్‌ సిబ్బంది సహకారం ఉందని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి (66) రాత్రికి రాత్రి హోటల్‌ నుంచి బయటపడి విమానంలో దుబాయి చేరుకున్నాడు. పాలికె అధికారులు స్పందించి ఆ హోటల్‌కు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఆ వ్యక్తిని కరోనా సోకిందని, ఒమిక్రాన్‌ పరీక్షలు నిర్వహించడానికి అనువుగా ఆహోటల్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి- ప్రత్యేక గదిలో క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమేగాక.. విదేశాలకు వెళ్లిపోవడానికి ‘ఎవరి సహకారం’ ఉందో గుర్తించే పని మొదలైందని పాలికె ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ బాలసుందర్‌ తెలిపారు. పరారైన వ్యక్తి కనీసం 24 మందికి వైరస్‌ సోకేలా చేశాడనే ఆందోళన వ్యక్తం చేశారు. గతనెల 25న బొమ్మసంద్రలో జరిగిన సమావేశంలో ఆయనతో కలిసి పాల్గొన్న ఆరుగురు వ్యక్తులకు కరోనా పరీక్షలు చేపట్టారు. నెగటివ్‌ రావడంతో ఊపిరిపిల్చుకున్నారు. దక్షిణాఫ్రికా వ్యక్తిని విమానాశ్రయం వద్దకు విడిచిపెట్టిన కారు డ్రైవర్‌కూ వైద్య పరీక్షలు చేశారు.

ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం
* నగరంలో ఒమిక్రాన్‌ వైరస్‌ సోకిన వ్యక్తులకు చికిత్స అందించేందుకు శివాజీనగర బౌరింగ్‌ ఆసుపత్రిలో 60, రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో 200, విక్టోరియాలో 60 పడకలను సిద్ధం చేశారు. వాటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫీవర్‌ క్లినిక్‌లను ప్రారంభిస్తారు. ఆక్సిజన్‌ ఉత్పిత్తి కేంద్రాలను సిద్ధం చేశారు. 
* ఒమిక్రాన్‌ వైరస్‌ నియంత్రణకు కఠిన నిబంధనలు విధించాలని కొవిడ్‌ సాంకేతిక నిపుణుల సమితి సిఫార్సు చేసింది. సినీ థియేటర్లు, మాల్స్, మార్కెట్లు, కల్యాణ మంటపాలు, దేవస్థానాలు, ప్రార్థన మందిరాల్లో ఎక్కువ చేరకుండా నియంత్రించాలని సూచించింది. విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలను జనవరి 15 వరకు నిషేధించారు. అందరూ మాస్క్‌ ధరించేలా నిబంధనలు విధించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని