logo

మూడు కేసులుంటే.. క్లస్టర్‌

ఒకే చోట మూడు కొవిడ్‌ కేసులు కనిపిస్తే క్లస్టర్‌గా ప్రకటించాలని అధికారులను ఆదేశించానని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు. ఆయన ఆర్‌.టి.నగరలోని తన నివాసం వద్ద శనివారం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు సంబంధించిన ప్రాథమిక

Published : 05 Dec 2021 01:44 IST


బెంగళూరు సిటీ మార్కెట్‌ ఆవరణలో టీకా వేయించుకుంటున్న వ్యాపారి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ఒకే చోట మూడు కొవిడ్‌ కేసులు కనిపిస్తే క్లస్టర్‌గా ప్రకటించాలని అధికారులను ఆదేశించానని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు. ఆయన ఆర్‌.టి.నగరలోని తన నివాసం వద్ద శనివారం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చిందని, పూర్తి స్థాయి నివేదికను తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించానని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో డెల్టా వేరియంట్‌ బారిన పడిన వారికి ఇస్తున్న చికిత్సనే ఇక్కడి బాధితులకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. విద్యా సంస్థలు, వసతి గృహాలు, అపార్ట్‌మెంట్లను ప్రత్యేకంగా విభజించి క్లస్టర్లు చేస్తున్నామని వివరించారు. రెండు డోసులు వేయించుకున్న వారినే మాల్స్, థియేటర్లలోకి అనుమతించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షించేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయని వివరించారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బయటకు వచ్చిన సమయంలో భౌతిక దూరాన్ని పాటించడం, మాస్కు ధరించడంలో నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరతలేదని స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ కొరతతో రోగులు మృతి చెందారని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఏ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడారో తనకు తెలియదన్నారు. టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రెండో డోసు వేయించుకోని వారికి ఇళ్ల వద్దకే వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. పోలీసులను ఉద్దేశించి హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చేసిన వ్యాఖ్యలకు వివరణ అడిగానని సీఎం తెలిపారు. పోలీసులు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితులకు రక్షణ ఇస్తున్న పోలీసులను ఉద్దేశించి హోం మంత్రి కఠిన పదజాలాన్ని ఉపయోగించారని చెప్పారు. 
కరోనా తాజా పరిస్థితి..
కర్ణాటకలో శనివారం 397 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 277 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. మరో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. క్రియాశీల కేసుల సంఖ్య 7,012కు పెరిగాయి. పాజిటివిటీ 0.35 శాతం, మరణాలు 1 శాతంగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3.87 లక్షల మంది శనివారం టీకా వేయించుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో 1.12 లక్షల మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. 


బెంగళూరులో స్వాబ్‌ పరీక్ష చేయించుకుంటున్న ఎమ్మెల్యే ఉదయ్‌ గరుడాచార్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని