logo

దళపతుల మద్దతే కీలకం

విధానపరిషత్‌ బరిలో నువ్వా నేనా అన్నట్లుగా రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరెత్తుతోంది. వీటి రెండింటి నడుమ తానేమీ తక్కువ కాదన్నట్లుగా జనతాదళ్‌ విమర్శల స్వరాన్ని పెంచింది. మొన్నటి వరకు సాధారణ విమర్శలతో కొనసాగిన ప్రచారం.. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది.

Published : 05 Dec 2021 01:44 IST


దావణగెరె సభలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : విధానపరిషత్‌ బరిలో నువ్వా నేనా అన్నట్లుగా రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరెత్తుతోంది. వీటి రెండింటి నడుమ తానేమీ తక్కువ కాదన్నట్లుగా జనతాదళ్‌ విమర్శల స్వరాన్ని పెంచింది. మొన్నటి వరకు సాధారణ విమర్శలతో కొనసాగిన ప్రచారం.. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది. ఈనెల 10న జరిగే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ప్రజాబలం ఏమాత్రం సన్నగిల్లలేదని చాటిచెప్పాలని అధికార భారతీయ జనతాపార్టీ తపిస్తుండగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఈ ఎన్నికల్లో గెలుపొందితే అధికార పార్టీ దూకుడును కట్టడి చేయాలని విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆశిస్తోంది. ఆరు స్థానాలకే పోటీకి పరిమితమైన జనతాదళ్‌ పార్టీ నాయకుల ప్రతీ కదలికా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంటున్నాయని పరిశీలకుల మదింపు. దళ్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, భాజపా తమ వంతు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నాయి. కోలారులో మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌ను భాజపా ఆకర్షించగా, సినీ నిర్మాత, ఎమ్మెల్సీ మనోహర్‌ను, ఆ పార్టీ శాసనసభ్యుడిని కాంగ్రెస్‌ తనవైపు లాక్కుంది. ఇతర నియోజకవర్గాల్లో ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది.
* తమ ప్రతీ అడుగూ ఆచితూచి వేస్తామని చెబుతూనే పార్టీ లక్ష్యం 2023లో రానున్న అసెంబ్లీ ఎన్నికలేనని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. తాము పోటీచేస్తున్న ఆరు స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల ఏ పార్టీకి మద్దతునిచ్చేదీ మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆయన చేసిన ప్రకటన తీవ్ర కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. పాతమైసూరు ప్రాంతంలో తమ పట్టును నిలుపుకొంటూనే మిగిలిన ప్రాంతాల్లో తమ మద్దతును ఎంపిక చేసే పార్టీకి ప్రకటిస్తామని వెల్లడించారు. 


తుమకూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్ధరామయ్య 

ఈ విషయాన్ని వెల్లడిస్తూనే ఆయన తమ చిరకాల ప్రత్యర్థి సిద్ధరామయ్యపై విమర్శల్ని గుప్పించడాన్ని విస్మరించలేదు. దళ్‌ను కుటుంబ పార్టీగా అభివర్ణించే మీరు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. మీ కుటుంబంలోనూ ఎక్కువ మందే ఉన్నారు కదా అని నిలదీశారు. ప్రత్యర్థిని వేలెత్తిచూపితే మిగిలిన నాలుగు వేళ్లూ మీ వైపే చూపుతాయనే విషయాన్ని విస్మరించినట్లున్నారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. కుటుంబ పాలన అంటూ నిత్యం విమర్శలతో నోరు నొప్పించుకునే బదులు ఓ పలకపై ఆ విషయాన్ని రాసి మెడకు వేలాడదీసుకోవాలని సలహా ఇచ్చారు. వ్యక్తిగత విమర్శల ద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరదనే వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు.
* భాజపా అనుబంధపార్టీ దళ్‌.. అంటూ సిద్ధరామయ్య చేసిన విమర్శల్ని మాజీ ముఖ్యమంత్రి యూడియూరప్ప తీవ్రంగా ఖండించారు. ఆయన తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఆరోపణలు నైతికంగా మనిషిని దిగజార్చేవిగా ఉంటాయనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఏకవచనంతో విమర్శలు మంచిదికాదని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. రెండు పార్టీలూ ప్రజల్ని మోసగిస్తున్నాయని భాజపా, దళ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఒకవైపు మాజీ ప్రధాని దేవేెగౌడ వైఖరి చూస్తుంటే తిరిగి భాజపా పంచన చేరుతున్నట్లుగా అనిపిస్తోందని అయితే కొన్ని నియోజవర్గాల్లో దళ్‌ నాయకులు కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. చిక్కమగళూరులో దళపతులు కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. 


మైసూరు సభలో దళపతి కుమారస్వామి తదితరులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని