భర్త భారమై.. ప్రియుడూ దూరమై..
బెళగావి, న్యూస్‌టుడే : జీవితాంతం తోడుగా ఉంటానంటూ తాళికట్టిన భర్త.. నాలుగేళ్లకే చేదుగా మారాడు. పక్కింటి యువకుడితో ప్రేమాయణం కొనసాగించి చివరకు భర్తకు దూరమై ప్రియుడిని వివాహం చేసుకుంది. ఇద్దరివీ వేర్వేరు కులాలనే నెపంతో ఆ యువకుడి తల్లిదండ్రులు ఆమెను చేరదీసేందుకు నిరాకరించారు. ఫలితంగా.. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తానంటూ ప్రియుడి నివాసం ఎదుట నిరాహార దీక్షకు దిగింది. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆమెను మహిళా సాంత్వన కేంద్రానికి తరలించారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా బైలహొంగలలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. బైలహొంగల పట్టణానికి చెందిన మహిళ (27)కు నాలుగు సంవత్సరాల కిందట గోకాక్ ఆలూకా అరభావి గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. కొంత కాలంగా ఆమెకు పక్కింటి మౌనేశ్ బడిగేర అనే యువకుడితో పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారింది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. భర్త లేనప్పుడు ప్రియుడితో కలిసి ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త మందలించాడు కూడా. ఆమె వైఖరిలో మార్పురాలేదు. ఈనేపథ్యంలో పెద్దలతో పంచాయతీ పెట్టించి ఆమెను మందలించేలా చేశాడు. ప్రియుడే సర్వస్వమనుకున్న ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. ప్రియుడితో కలిసి ఓ రోజున ఆలయంలో వివాహం చేసుకుంది. ఇంటికి ఆమెను తీసుకొచ్చేందుకు మౌనేశ్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో మౌనేశ్ తల్లిదండ్రుల సూచనతో కొన్ని రోజులుగా అదృశ్యమయ్యాడు. తనను ఒంటరిదాన్ని చేశావంటూ సోమవారం నుంచి ఆమె గోకాక్‌లోని మౌనేశ్ నివాసం ఎదుట నిరాహార దీక్షకు దిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను గోకాక్‌లోని మహిళా సాంత్వన కేంద్రానికి ఇతరలించారు. మౌనేశ్ వచ్చిన తరువాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.