logo

Elephant: బెడిసికొట్టిన ఏనుగు అపహరణ యత్నం!

వక్కలు.. నగలు.. చిల్లర దొంగల గురించి వింటున్నాం.. చూస్తున్నాం. ఏకంగా ఏనుగునే అపహరించాలని చూసిన ఘరానా దొంగల విషయం ఇప్పుడు వెలుగుచూసింది! ఇటీవల తుమకూరులో జరిగిన...

Updated : 03 Jan 2022 07:45 IST

తుమకూరు (బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే: వక్కలు.. నగలు.. చిల్లర దొంగల గురించి వింటున్నాం.. చూస్తున్నాం. ఏకంగా ఏనుగునే అపహరించాలని చూసిన ఘరానా దొంగల విషయం ఇప్పుడు వెలుగుచూసింది! ఇటీవల తుమకూరులో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తుమకూరులోని కరిబసవస్వామి మఠానికి చెందిన లక్ష్మి అనే ఏనుగును అపహరించేందుకు చేసిన యత్నం బెడిసి కొట్టింది. ఈ దొంగలకు సాక్షాత్తూ అటవీ శాఖలోని కొందరు అధికారులు సహకరించడం గమనార్హం. ఈ సంఘటన వివరాల్లోకెళ్తే..... చిన్న పిల్లాడిని సైతం ఆత్మీయంగానే చూసే లక్ష్మిని ఎలాగైనా అపహరించాలని గుజరాత్‌కు చెందిన ఓ సర్కస్‌ కంపెనీ నిర్వాహకులు వ్యూహాన్ని రూపొందించారు. గత నెలలో పశువైద్యుల పేరుతో కొందరు మఠాన్ని సందర్శించారు. ఏనుగుకు వైద్యపరీక్షలు నిర్వహించి దాని కడుపులో గడ్డ ఉందని, తొలగించకపోతే ప్రాణాలకే ముప్పని మఠం వర్గాల్ని బెదిరించారు. దీంతో మఠం ప్రతినిధులు ఏనుగును బన్నేరుఘట్టలోని పశువైద్య కేంద్రానికి తరలించేందుకు అంగీకరించారు. కొద్ది రోజుల తరువాత ఆ ముఠా సభ్యులు తిరిగి మఠానికి వచ్చి లారీలో ఏనుగును తీసుకెళ్లారు. బన్నేరుఘట్టకు కాకుండా దాబస్‌పేట రాగానే మావటీని, ఇతర సహాయకులపై దాడిచేసి వారిని లారీ నుంచి దించేశారు. అనంతరం లారీని నేరుగా కుణిగల్‌ తాలూకాని ఓ గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచి ఉంచారు. విషయం తెలుసుకున్న మఠం వర్గాలు కుణిగల్‌ తాలూకాలో గాలించి చివరకు ఏనుగును గుర్తించి మరో లారీలో దాన్ని మఠానికి తీసుకొచ్చారు. ఏనుగును అపహరించేందుకు రూ.40 లక్షలకు బేరమాడారని ప్రాథమిక సమాచారం. మఠం వర్గాల ఫిర్యాదు ఆధారంగా తుమకూరు నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని