logo

వారాంతపు కర్ఫ్యూ విజయవంతం

వారాంతపు కర్ఫ్యూ విజయవంతమైంది. శని, ఆదివారాల్లో నగరవాసులు స్వచ్ఛందంగా బంద్‌ వాతావరణాన్ని సృష్టించారు. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. వారాంతపు విహార యాత్రలు, వినోదాలకు స్వస్తి పలికారు. కర్ఫ్యూను పోలీసులు, బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారులు కట్టుదిట్టంగా

Published : 17 Jan 2022 04:45 IST


యశ్వంతపుర కూడలిలో ద్విచక్రవాహనదారులను ప్రశ్నిస్తున్న పోలీసులు

బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్‌టుడే: వారాంతపు కర్ఫ్యూ విజయవంతమైంది. శని, ఆదివారాల్లో నగరవాసులు స్వచ్ఛందంగా బంద్‌ వాతావరణాన్ని సృష్టించారు. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. వారాంతపు విహార యాత్రలు, వినోదాలకు స్వస్తి పలికారు. కర్ఫ్యూను పోలీసులు, బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారులు కట్టుదిట్టంగా అమలు చేశారు. సంక్రాంతి పండుగను ప్రజలు ఇళ్లకు పరిమితం చేసుకున్నారు. బయట ఎక్కడా సాంస్కృతిక కార్యక్రమాల సందడి కానరాలేదు. దేవస్థానాల్లోకి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడం వల్ల దేవాలయాల వద్ద భక్తుల రద్దీ లేకుండా పోయింది. దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. సిటీ మార్కెట్‌ను బిన్నిమిల్లు మైదానానికి తరలించారు. వీధి వ్యాపారాలకు అనుమతించలేదు. మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఆదివారం మాంసం దుకాణాల్లో జోరుగా వ్యాపారం జరిగింది. కేవలం ఐదు వందల బీఎంటీసీ బస్సులు నడిపినా ప్రయాణికులు తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అరగంటకు ఓ మెట్రో రైలు నడిచింది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దూర ప్రాంతాలకు కె.ఎస్‌.ఆర్టీసీ బస్సులు సంచరించాయి. ఆటోలు పరిమిత సంఖ్యలో ఉండడంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వాహన సంచారం స్తంభించడంతో రహదారులు బోసిపోయాయి. ఉపరితల వంతెనలను మూసివేశారు. వాహనదారులు రాకపోవడంతో పెట్రోలు బంకులు మూతపడ్డాయి. నిత్యం రద్దీగా కనిపించే చిక్కపేట, బాళేపేట, మామూలుపేట, కాటన్‌పేట, ఎస్‌పీ రోడ్డు, గాంధీబజారు తదితర వ్యాపార ప్రాంతాల్లో హడావిడి కానరాలేదు. వారాంతపు కర్ఫ్యూకు ప్రజలు సహకరించడం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ధన్యవాదాలు చెప్పారు. మరో రెండువారాలు వారాంతపు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు, వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నిత్యం రద్దీగా ఉండే రేస్‌కోర్స్‌ రోడ్డు బోసిపోయింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని