logo

చెన్నపట్టణ బొమ్మలకు సరికొత్త రూపు

కొయ్య బొమ్మల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకునేందుకు చెన్నపట్టణ సిద్ధమవుతోంది. సంప్రదాయాలకు పెద్దపీట వేసే మైసూరు రాజవంశంలో ప్రస్తుత మహారాణి త్రిషికా సింగ్‌ ఒడెయరు సరికొత్త డిజైన్లను సూచించారు. ఇందులో భాగంగా ముందుగా సఫారీ సెట్‌ బొమ్మల్ని ప్రతిపాదించారు. వీటి

Published : 17 Jan 2022 04:45 IST


చెన్నపట్టణ బొమ్మలు

బొమ్మల తయారీ

రామనగర, న్యూస్‌టుడే: కొయ్య బొమ్మల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకునేందుకు చెన్నపట్టణ సిద్ధమవుతోంది. సంప్రదాయాలకు పెద్దపీట వేసే మైసూరు రాజవంశంలో ప్రస్తుత మహారాణి త్రిషికా సింగ్‌ ఒడెయరు సరికొత్త డిజైన్లను సూచించారు. ఇందులో భాగంగా ముందుగా సఫారీ సెట్‌ బొమ్మల్ని ప్రతిపాదించారు. వీటి తయారీకి చెన్నపట్టణలోని బొమ్మల తయారీదారులు నడుం బిగించారు. సఫారీ బొమ్మలకు చిన్నారుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంతో అంతర్జాతీయంగా కూడా వీటికి డిమాండ్‌ పెరిగింది. దశాబ్ద కాలం క్రితం వరకు చెన్నపట్టణ బొమ్మలకు దేశీయంగానూ, అప్పుడప్పుడూ అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉండేది. తరువాత కాలంలో చైనా బొమ్మలు తక్కువ ధరలకే లభించడంతో క్రమేపీ ఆదరణ కోల్పోయింది. రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం కొత్త రకం బొమ్మల తయారీని చేపట్టడంతో చెన్నపట్టణ బొమ్మలకు పూర్వవైభవం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త రకం బొమ్మల్ని ‘ది లిటిల్‌బంటింగ్‌ డాట్‌కామ్‌’ ద్వారా కొనుగోలు చేసేందుకు వీలుంటుందని త్రిషికా సింగ్‌ ఒడెయరు తెలిపారు. సంప్రదాయ డిజైన్లకే పరిమితమైన చెన్నపట్టణ బొమ్మలకు ఒడెయరు జోక్యంతో సరికొత్త రూపు సంతరించుకున్నాయి. గత ఏడాది ఆమె మహారాజు యదువీర్‌తో కలిసి చెన్నపట్టణను సందర్శించి అక్కడి బొమ్మల తయారీదారులతో వివిధ డిజైన్లపై చర్చించి తగిన సూచనలు చేశారు. ఆనాటి పర్యటన ఫలితంగా ప్రస్తుతం కొత్త డిజైన్లలో బొమ్మలు అందుబాటులోకి వచ్చాయి.


చెన్నపట్టణ బొమ్మల తయారీని ఇటీవల వీక్షించిన మహారాణి త్రిషికా సింగ్‌ ఒడెయరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని