logo

ఏడు కిలోమీటర్ల దూరంలో ప్రసూతి ఆసుపత్రా?

రూ.12 కోట్ల నిధులతో ప్రభుత్వం సింధనూరు తాలూకాకు మంజూరు చేసిన ప్రసూతి కేంద్రం (తల్లీ-శిశువుల ఆసుపత్రి) మస్కి మార్గంలోని కల్లూరు గ్రామంలో నిర్మింపజేయడంలో స్థానిక ఎమ్మెల్యే నాడగౌడ దురుద్దేశం ఏదో దాగి ఉందని మాజీ శాసనసభ్యుడు బాదర్లి

Published : 18 Jan 2022 01:32 IST


మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాదర్లి, ఎమ్మెల్సీ శరణప్ప బయ్యాపూరు

సింధనూరు, న్యూస్‌టుడే: రూ.12 కోట్ల నిధులతో ప్రభుత్వం సింధనూరు తాలూకాకు మంజూరు చేసిన ప్రసూతి కేంద్రం (తల్లీ-శిశువుల ఆసుపత్రి) మస్కి మార్గంలోని కల్లూరు గ్రామంలో నిర్మింపజేయడంలో స్థానిక ఎమ్మెల్యే నాడగౌడ దురుద్దేశం ఏదో దాగి ఉందని మాజీ శాసనసభ్యుడు బాదర్లి హంపనగౌడ ఆరోపించారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తే..పురిటి నొప్పులతో తాళలేక ఆసుపత్రికి చేరేలోపే గర్భిణులు నరకయాతన అనుభవిస్తారన్నారు. ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ప్రజల నుంచి అనేక విమర్శలు వినిపిస్తుండటంతో తానూ నోరు విప్పాల్సి వచ్చిందని బాదర్లి పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ శరణప్ప బయ్యాపూరు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలసి శంకుస్థాపన చేసిన కొప్పళ ఎంపీ కూడా స్థలాన్ని చూసి పెదవి విరవడం శోచనీయమని ఖండించారు. శ్మశానం పక్కన, పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరాన నిర్మించడం వెనుక నాడగౌడ దురుద్దేశం ఏమిటన్నది తాము త్వరలోనే బట్టబయలు చేస్తామన్నారు. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామని..నాడగౌడ వర్గం ఈ ఆసుపత్రి నిర్మాణంలో మొండిగా ముందుకెళితే తీవ్రంగా అడ్డుకుంటామని బాదర్లి హెచ్చరించారు. వళబళ్లారి మార్గంలో కొత్తగా లేఅవుట్లు ఆయ్యాయి, పీడబ్ల్యూడీక్యాంపు నీటిపారుదల శాఖ స్థలం విశాలంగా ఉంది, పీజీ కేంద్రం ఆనుకుని కూడా ఆరు ఎకరాల స్థలం ఉంది..వీటిలో రెండు ఎకరాలు తీసుకోవడం మానేసి కల్లూరు గ్రామంలో ఆసుపత్రి నిర్మించడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని