logo

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు వెన్నుదన్ను

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మరింత విస్తరించి, పుంజుకోనున్నాయి. కేంద్ర సర్కారు పీఎంఎఫ్‌ఎంఈ (సూక్ష్మ ఆహార సంస్కరణ పరిశ్రమల పథకం) ద్వారా ఇచ్చే 35 శాతం ఆర్థిక సాయానికి రాష్ట్ర సర్కారు మరో 15 శాతం చేయూత ఇవ్వనుంది.

Published : 18 Jan 2022 01:32 IST


 మహిళా పారిశ్రామిక వేత్తలకు సర్కారే అండ

ఈనాడు డిజిటల్, బెంగళూరు : రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మరింత విస్తరించి, పుంజుకోనున్నాయి. కేంద్ర సర్కారు పీఎంఎఫ్‌ఎంఈ (సూక్ష్మ ఆహార సంస్కరణ పరిశ్రమల పథకం) ద్వారా ఇచ్చే 35 శాతం ఆర్థిక సాయానికి రాష్ట్ర సర్కారు మరో 15 శాతం చేయూత ఇవ్వనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించే సాయంతో మొత్తం ఆర్థిక సాయం ప్రమాణం 50శాతానికి చేరుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కారు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆహార ఉత్పాదన పరిశ్రమలను స్థాపించే చిన్న తరహా పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడిలో 50శాతం రాయితీ రూపంలో అందనుంది. ఇదివరకటి యడియూరప్ప సర్కారు ప్రతిపాదించిన బడ్జెట్‌లో చేసిన ప్రకటన ప్రకారం ఇకపై వ్యవసాయ పంటల ఆధారిత పరిశ్రమలకు దండిగా నిధులు అందనున్నాయి.
2,751 మందికి లబ్ధి
పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా ఐదేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు అందించనున్నాయి. 2020-21 ఏడాది నుంచి 2024-25 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. ఇందులో 2651 ఏకవ్యక్తి పరిశ్రమలు, 100 సమూహ పరిశ్రమలు లబ్ధి పొందుతాయి. ప్రత్యక్షంగా పారిశ్రామిక ఔత్సాహికులు, పరోక్షంగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. ఆత్మనిర్భర్‌ అభియాన్‌లో భాగంగా అందే ఈ నిధులతో వ్యవసాయ పంటలకు మరింత డిమాండు పెరుగుతుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ నోడల్‌గా, కెపెక్‌ సంస్థ నోడల్‌ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. కరోనా సమయంలో వ్యవసాయ పంటల విక్రయం మందగించిన నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ద్వారా ఆ సమస్య తీరనుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి బి.సి.పాటిల్‌ పేర్కొన్నారు.
ఒక జిల్లా.. ఒకే ఉత్పత్తి
ఒక జిల్లా ఒకే ఉత్పత్తి (వన్‌ డిస్ట్రిక్ట్‌..వన్‌ ప్రొడక్ట్‌- ఓడీఓపీ) నినాదంతో ఏర్పాటయ్యే పీఎంఎఫ్‌ఎంఈ పరిశ్రమలు జిల్లాల్లోని వ్యవసాయ ఉత్పత్తులకు బ్రాండింగ్‌ విలువ కల్పించనున్నాయి. ఇప్పటికే బెంగళూరులో బేకరీ ఉత్పత్తులు, ఉడుపిలో చేపల ఆహారం, మండ్యలో బెల్లం వంటివి పీఎంఎఫ్‌ఎంఈ పథకం జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక వ్యవసాయ ఉత్పత్తికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తారని కర్ణాటక వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతి సంస్థ (కేఏపీపీఈసీ) ఎండీ బి.శివరాజు తెలిపారు. రాయితీ విలువ 50 శాతానికి చేరుకోవటంతో ఔత్సాహికుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్ర సర్కారు రూ.493కోట్లతో ఈ పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించనుండగా, వ్యక్తికి గరిష్ఠంగా రూ.40 వేలు, సమూహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందనుందన్నారు. ఈ మేరకు జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు శివరాజు చెప్పారు.


అనుబంధ ఉత్పత్తులకు సర్కారు ప్రోత్సాహం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని