logo

వైరస్‌ తీవ్రత తగ్గుముఖం

కన్నడనాట ఆదివారంతో పోల్చితే.. సోమవారం ఏడు వేల పైచిలుకు కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ ఏడు శాతం తగ్గింది. వారాంతపు లాక్‌డౌన్‌తోనే కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి ఆర్‌.అశోక్‌ వ్యాఖ్యానించారు. నగరంలో 60 శాతం మంది

Published : 18 Jan 2022 01:32 IST


 రైల్వే స్టేషన్‌ ఆవరణలో స్వాబ్‌ పరీక్ష  చేయించుకుంటున్న ప్రయాణికుడు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కన్నడనాట ఆదివారంతో పోల్చితే.. సోమవారం ఏడు వేల పైచిలుకు కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ ఏడు శాతం తగ్గింది. వారాంతపు లాక్‌డౌన్‌తోనే కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి ఆర్‌.అశోక్‌ వ్యాఖ్యానించారు. నగరంలో 60 శాతం మంది జలుబు, జ్వరం, దగ్గు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ ఉన్నట్లు కాదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ లక్షణాలు నాలుగు రోజులు దాటినా.. అలానే కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచించారు. క్లినిక్‌లు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న రోగుల సంఖ్య శనివారం నుంచి పెరుగుతోంది. టీకా వేయించుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపించగా, మొదటి రెండు డోసులతో పోల్చితే బూస్టర్‌ డోసు వేయించుకునేందుకు ఎక్కువ మంది వస్తున్నారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత వారం సొంత ఊర్లకు వెళ్లిన నగరవాసులు అందరూ ఒకేసారి తిరిగి వస్తుండడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. ఎక్కువ సంఖ్యలో వచ్చినా.. ఆరోగ్య శాఖ కార్యకర్తలు వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు కొనసాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు లేకుండా వస్తున్న వారికి మార్షల్స్‌ జరిమానాలు విధించారు.
* వారాంతపు కర్ఫ్యూను తొలగించాలని బెంగళూరు వ్యాపారులు డిమాండ్‌ చేశారు. నిబంధనలను మరింత కఠినం చేస్తూ, కర్ఫ్యూను తొలగించాలని పలు వర్తక సంఘాలు, హోటళ్ల యాజమాన్యాలు, థియేటర్లు, మాల్స్‌ నిర్వాహకులు ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే నగరంలో కేసులు ఎక్కువగా ఉండడంతో 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకు వచ్చారు. జనవరి 31 వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని కొత్వాలు కమల్‌పంత్‌ ప్రకటించారు.

తాజా కేసులు..
కర్ణాటకలో సోమవారం 27,156 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో 7,827 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ 14 మంది మరణించారు. పాజిటివిటీ 12.45 శాతం, మరణాలు 0.05 శాతంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 2.17 లక్షలకు చేరుకుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశాల నుంచి వచ్చిన 565 మందితో సహా, 1,081 మంది దేశీయ ప్రయాణికులకు స్వాబ్‌ టెస్టులు చేశారు. వీరితో పాతిక మందికి కొవిడ్‌ ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో 2.17 లక్షల మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 2.16 లక్షల మంది టీకా వేయించుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని