logo

బడ్జెట్‌ రూపకల్పనకు కసరత్తు

నగర పాలికె బడ్జెట్‌ (2022-23) తయారీకి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా జిల్లా పాలనాధికారి, లేదా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగే సాధారణ సమావేశంలో పద్దు ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. పాలికెలోని 39 వార్డులకు

Published : 21 Jan 2022 06:31 IST


బళ్లారి నగర పాలికె కార్యాలయం

బళ్లారి, న్యూస్‌టుడే: నగర పాలికె బడ్జెట్‌ (2022-23) తయారీకి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా జిల్లా పాలనాధికారి, లేదా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగే సాధారణ సమావేశంలో పద్దు ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. పాలికెలోని 39 వార్డులకు 2021 ఏప్రిల్‌ 28న ఎన్నిక జరిగి, 30న ఫలితాలు వెల్లడించినా నేటి వరకు మేయర్‌, ఉపమేయర్‌, స్థాయి సమితి అధ్యక్షులను ఎన్నుకోకపోవడంతో అధికారులు బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. 2020-21, 2021-22 సంవత్సరాలలోనూ పాలక మండలి సభ్యులు లేకపోయినా జిల్లా పాలనాధికారి ఆమోదంతో బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. ఈ బడ్జెట్లలో నిధుల కేటాయింపు తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈసారి బడ్జెట్‌కు ముందు మేయర్‌ ఎన్నిక జరిగితే బాగుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. పాలికె అధికారులు తయారు చేసిన బడ్జెట్‌ను ఆర్థిక సమితి పరిశీలన తర్వాత సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అందులో ఆమోదించిన తర్వాత బడ్జెట్‌ నిధులను ఖర్చు చేస్తారు. నగర పాలక సంస్థ చట్టం ప్రకారం పాలక మండలి లేకపోతే పాలికె పరిపాలన అధికారి, జిల్లా పాలనాధికారి ఆమోదించాలి. ఫిబ్రవరి నెలాఖరులోగా మేయర్‌, ఉపమేయర్‌, స్థాయి సమితి అధ్యక్ష ఎన్నిక ముగిస్తే సాధారణ సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్‌ను ఆమోదిస్తారు. లేకుంటే కమిషనర్‌ పరిశీలించాక డీసీ అనుమతి పొందవలసి ఉంటుందని నగర పాలికె ముఖ్య లెక్కధికారి రాము ‘న్యూస్‌టుడే’కి తెలిపారు. బుధవారం స్వీకరించిన బడ్జెట్‌ సలహా సమావేశంలో కార్పొరేటర్లు అనధికారికంగా, నగర పౌరుల హోదాలో పాల్గొని సూచనలు చేసి ఉంటే బాగుండేదని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని