logo

యువజన కాంగ్రెస్‌లో రాద్ధాంతం

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం మరో పోరాటం ప్రారంభమైంది. త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని ప్రచారం చేసుకుంటున్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు మొహమ్మద్‌ నలపాడ్‌- బళ్లారి గ్రామీణ

Published : 21 Jan 2022 06:31 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం మరో పోరాటం ప్రారంభమైంది. త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని ప్రచారం చేసుకుంటున్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు మొహమ్మద్‌ నలపాడ్‌- బళ్లారి గ్రామీణ జిల్లా అధ్యక్షుడు సిద్ధుహళ్లేగౌడపై దాడి చేసినట్లు సమాచారం గుప్పుమంది. యువజన అధ్యక్షస్థానానికి 2021 జనవరిలో జరిగిన ఎన్నికల్లో శాంతినగర శాసనసభ్యుడు ఎన్‌.ఎ.హ్యరీస్‌ తనయుడు నలపాడ్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అతడిపై క్రిమినల్‌ కేసులు ఉండటంతో పార్టీ అధిష్ఠానం ఆయనను పక్కనపెట్టి రెండో స్థానం వచ్చిన మాజీ మంత్రి ఎం.ఆర్‌.సీతారాం తనయుడు రక్షా రామయ్యకు అధ్యక్ష స్థానం కట్టబెట్టింది. అప్పటి నుంచి నలపాడ్‌- రక్షా రామయ్య మధ్య పోరు కొనసాగుతోంది. ఉపాధ్యక్షురాలు భవ్య నరసింహమూర్తిని నలపాడ్‌ బెదిరించారనే ఆరోపణ నేపథ్యంలో ప్రత్యర్థి నేతలు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదం పెద్దది కాకుండా యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌ జోక్యం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో చర్చించి ఓ పరిష్కార మార్గం సూచించారు. గత ఏడాది డిసెంబరు 31 వరకు అధ్యక్ష స్థానంలో రక్షా రామయ్య కొనసాగాలని- ఆపై నలపాడ్‌కు అవకాశం కల్పించాలని సూచించారు. డీకే మద్దతు తనకే ఉందని, ఫిబ్రవరిలో పదవి చేపడతానని నలపాడ్‌ ప్రచారం చేసుకుని.. ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆ ఏర్పాట్లపైనే బుధవారం సాయంత్రం నగరంలోని యలహంక క్లబ్‌లో ఏర్పాట్లు చేయగా.. అన్ని జిల్లాల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులూ హాజరయ్యారు. అక్కడే బళ్లారి యువ నేతపై దాడి జరిగిందని సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధుహళ్లేగౌడ ప్రయత్నించగా అగ్రనేతలు జోక్యం చేసుకుని అడ్డుకున్నట్లు తెలిసింది. నలపాడ్‌ ప్రవర్తనపై బళ్లారి నేత తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. దాడి ఒట్టి ప్రచారమని ఇటు సిద్ధుహళ్లేగౌడ.. అటు నలపాడ్‌ గురువారం స్పష్టం చేశారు. ఇదంతా పెద్ద కుట్రగా తప్పుపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని