logo

మీర్‌సాదిక్‌ సౌధానికి చెదలు

‘ఎవరికైనా నమ్మక ద్రోహం చేస్తే.. అలాంటి వ్యక్తిని మీర్‌ సాదిక్‌’ అని పిలుస్తుంటారు. ఇంతకూ ఆ మీర్‌ సాదిక్‌ ఎవరు? అతడి సమాధి ఎక్కడుంది? అనే ప్రశ్నలు  తొలుస్తుంటాయి. శ్రీరంగపట్టణంలో మీర్‌ సాదిక్‌ సమాధి ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచానికి అంతగా పరిచయం లేదు.

Published : 21 Jan 2022 06:31 IST

 శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణం


ఇదే.. చారిత్రక మీదర్‌సాదిక్‌ సమాధి కట్టడం.. 

మండ్య, న్యూస్‌టుడే : ‘ఎవరికైనా నమ్మక ద్రోహం చేస్తే.. అలాంటి వ్యక్తిని మీర్‌ సాదిక్‌’ అని పిలుస్తుంటారు. ఇంతకూ ఆ మీర్‌ సాదిక్‌ ఎవరు? అతడి సమాధి ఎక్కడుంది? అనే ప్రశ్నలు  తొలుస్తుంటాయి. శ్రీరంగపట్టణంలో మీర్‌ సాదిక్‌ సమాధి ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచానికి అంతగా పరిచయం లేదు. కనీసం పరిసర ప్రాంతాల్లోని ప్రజలను తరిచి చూసినా బిక్కమొహమే దర్శనమిస్తుంది. బ్రిటిషర్లను గడగడలాడించిన టిప్పు సుల్తాన్‌ సామ్రాజ్యంలో మీర్‌ సాదిక్‌ ఓ మంత్రి. అంతకుమించి టిప్పు సుల్తాన్‌కు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఒక విధంగా చెప్పాలంటే మీర్‌ సాదిక్‌ తలలో నాలుక వంటివాడని అప్పట్లో పేరుండేది. ఇంతటి విశ్వాసపాత్రుడైన మీర్‌సాదిక్‌ బ్రిటిషర్లతో చేతులు కలిపాడు. అప్పటికే మూడు యుద్ధాలతో తీవ్ర గర్వభంగాన్ని ఎదుర్కొన్న బ్రిటిష్‌ అధికారులు నాలుగో యుద్ధం సమయంలో మీర్‌ సాదిక్‌ను మచ్చిక చేసుకున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురిచేశారోగానీ టిప్పు సైనిక రహస్యాల్ని ఎప్పటికప్పుడు బ్రిటిషర్లకు చేరవేసేవాడు. శత్రువులు చొరబడేందుకు ఏమాత్రం వీలులేని శ్రీరంగపట్టణ కోటలోకి ఏవిధంగా ప్రవేశించడానికి వీలుంటుందోననే రహస్య మార్గాన్ని వెల్లడించాడట. మీర్‌ సాదిక్‌ సూచనల ఆధారంగానే బ్రిటిష్‌ సైన్యాలు కోటలోనికి ప్రవేశించి టిప్పును సంహరించడంతో పాటు కోటను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. టిప్పు వీర మరణం వార్తను తెలుసుకున్న విశ్వాసపాత్రుడుగా ఉండే అబ్దుల్‌ గఫూర్‌ అనే వ్యక్తి మీర్‌ సాదిక్‌ను ముక్కలుగా నరికాడని చరిత్ర చెబుతోంది. శ్రీరంగపట్టణను కైవశం చేసుకునేందుకు సహకరించిన మీర్‌ సాదిక్‌ శవాన్ని బ్రిటిష్‌ అధికారులు అప్పటికే సలీం ఆలీ అనే మంత్రి కోసం నిర్మించిన కట్టడంలో సమాధి చేశారనేది చరిత్ర.
* ఇక వర్తమానంలోకి వస్తే.. టిప్పు సుల్తాన్‌ సమాధుల నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్‌ సాదిక్‌ సమాధి కట్టడం నేడోరేపో కూలేందుకు సిద్ధంగా ఉంది. అటువైపు వెళ్లడానికి ఏ ఒక్కరూ సాహసించరు. పగటిపూట వెళ్లడానికి  కూడా వీలులేనంతటి పరిస్థితులు కనిపిస్తాయి. కట్టడం శిథిలావస్థకు చేరుకున్నా, అందులోని సమాధి ప్రాంతం నిర్మాణ వ్యర్థాలతో కనిపిస్తున్నా అటువైపు ఏ ఒక్కరు కూడా వెళ్లని పరిస్థితులున్నాయి. టిప్పు సుల్తాన్‌ను మోసగించాడనే ఆగ్రహం ఇప్పటికీ అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. ఈ కారణంగానే అక్కడో సమాధి ఉందనే విషయం స్థానికులకు తెలియదంటే ఆశ్చర్యమే. శ్రీరంగపట్టణ పతనానికి కారణమైన మీర్‌ సాదిక్‌ సమాధి ప్రాంతాన్ని భావితరాలకు తెలియాలంటే సంరక్షణ చర్యలు ఎంతైనా అవసరం. నిర్లక్ష్యం ఇదే విధంగా కొనసాగితే మరో రెండు మూడేళ్ల తరువాత ఆ ప్రాంతం పూర్తిగా శిథిలవమడం ఖాయం. 


సమాధి పరిసరాలన్నీ అధ్వానంగా కనిపిస్తున్న తీరు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని