logo

ముప్పు ముంగిట నగరవాసి

రాజధాని నగరంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఒకే రోజు 30,590 కరోనా కేసులు దాఖలైనట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారులు ప్రకటించారు. మరోవైపు చికిత్స ఫలించక

Published : 21 Jan 2022 06:31 IST


డాక్టర్‌ అంబేడ్కర్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో కరోనా చికిత్స కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కేజే జార్జి తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాజధాని నగరంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఒకే రోజు 30,590 కరోనా కేసులు దాఖలైనట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారులు ప్రకటించారు. మరోవైపు చికిత్స ఫలించక ఐదుగురు మృతి చెందారు. క్రియాశీల కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. వారిలో 20 శాతం మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగతా రోగులు ఇళ్ల వద్దనే సేవలు పొందుతున్నారు. ఏక్షణంలోనైనా రోజువారీ కరోనా కేసులు లక్ష దాటే ప్రమాదం లేకపోలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ హెచ్చరించారు. కేసులు పెరుగుతున్నా.. వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని ఆయన వివరించారు. అలాగని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైరస్‌ పీడితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు సంబంధిత కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించిన దాఖలాలు లేవు. వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులను ఇంకా నియమించలేదు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులకే వీటి బాధ్యత అప్పగించారు. ఇప్పటికిప్పుడు అత్యవసర రోగులను బౌరింగ్, కేసీ జనరల్, సీవీరామన్‌ ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు. చికిత్సకు ప్రతిగా వైద్య రుసుములు పెంచాలని ప్రైవేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం సామాన్య వార్డులో రోజుకు పడక రుసుముగా రూ.10 వేలు, ఐసీయూ వార్డులో రూ.15 వేలు, వెంటిలేటర్‌ పడకకు రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని పెంచాలని వారంతా కోరుతున్నారు. 
బి నగరంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో కరోనా చికిత్స కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించారు. అక్కడి వైద్య సౌకర్యాలను ఎమ్మెల్యే కేజే జార్జి గురువారం పరిశీలించారు.  ప్రస్తుతం 50 పడకలు ఏర్పాటు చేశామని, అందులో పది ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయని ఆయన వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని