logo

వ్యవసాయం పండగే

వ్యవసాయ ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయాలన్న లక్ష్యంతో కర్ణాటక సర్కారు మరో కీలక అడుగు వేసింది. గత బడ్జెట్‌లో ప్రకటించినట్లే వ్యవసాయం, ఉద్యాన శాఖల నుంచి అనుబంధ వ్యవసాయాన్ని వేరుచేస్తూ ప్రత్యేక డైరెక్టరేట్‌ (శాఖ) రూపుదాల్చింది. ఈ విభాగాల్లో

Published : 21 Jan 2022 06:31 IST

 ప్రత్యేక డైరెక్టరేట్‌కు రూపకల్పన
 రైతుల ఆదాయానికి భరోసా


పందెం గుర్రాల పోషణకు ప్రత్యేక నిధులు

ఈనాడు డిజిటల్, బెంగళూరు : వ్యవసాయ ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయాలన్న లక్ష్యంతో కర్ణాటక సర్కారు మరో కీలక అడుగు వేసింది. గత బడ్జెట్‌లో ప్రకటించినట్లే వ్యవసాయం, ఉద్యాన శాఖల నుంచి అనుబంధ వ్యవసాయాన్ని వేరుచేస్తూ ప్రత్యేక డైరెక్టరేట్‌ (శాఖ) రూపుదాల్చింది. ఈ విభాగాల్లో నిపుణులైన 13 మందితో కొత్త డైరెక్టరేట్‌ త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. అనుబంధ వ్యవసాయానికి (సెకండరీ అగ్రికల్చర్‌) ఇకపై ప్రత్యేక నిధులు, బ్యాంకు రుణాలు, రాయితీలు, మార్కెట్‌లకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, అటవీ శాఖల అధికారులు అనుబంధ వ్యవసాయ శాఖలో వివిధ హోదాలో నియమితులవుతారు. గత ఆగస్టులో కేంద్ర వ్యవసాయ ఆదాయ పర్యవేక్షణ సమితితో ముఖ్యమంత్రి పలుమార్లు చర్చించారు. ఈ సమితి సిఫార్సులతో అనుబంధ వ్యవసాయ శాఖ విధివిధానాలను సిద్ధం చేశారు.
 బృందమిదిగో..
వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ అనుబంధ వ్యవసాయ శాఖకూ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ డైరెక్టర్లు సభ్యులుగా, వాటర్‌షెడ్‌ అభివృద్ధి, పశు సంవర్ధక, ఉద్యాన, మత్స్య, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖల సంయుక్త సంచాలకులు, అటవీశాఖ ప్రధాన పరిరక్షకులు సాంకేతిక అధికారులుగా పని చేస్తారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ ఆర్థిక కోర్సుల ఆచార్యులు, సర్కారు గుర్తించిన ఆదర్శ రైతులు, రైతు ప్రతినిధులు సభ్యులుగా పని చేస్తారు. శాశ్వత నియామకాలు చేపట్టే వరకు వీరంతా తాత్కాలికంగా విధులు నిర్వహిస్తారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, డిజిటల్‌ టెక్నాలజీ, డేటా అనాలసిస్‌ నిపుణులను పొరుగు సేవల విధానంతో నియమిస్తారు. కొత్త బృందం సమీకృత వ్యవసాయ వ్యవస్థ, వ్యవసాయ వలయాల్లో మార్కెట్‌ వ్యవస్థలను పర్యవేక్షిస్తారు.
రైతులకు భరోసా
పండించిన పంటకు మార్కెట్‌ ధర లభించకున్నా రైతుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించటమే అనుబంధ వ్యవసాయ శాఖ లక్ష్యం. వర్షం, నీటిపారుదల పంటలు అతివృష్టితో నష్టపోయినా రైతుకు ఈ అనుబంధ వ్యవసాయం ఆదుకుంటుంది. స్థానికంగా లభించే వ్యవసాయ, ప్రకృతి సహజమైన వనరులతో ప్రాథమిక, అనుబంధ ఉత్పత్తులు చేపట్టేలా రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ డైరెక్టరేట్‌ సహకరిస్తుంది. ఉత్పత్తుల తయారీకి అవసరమైన నిధులు, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్‌ సదుపాయాలను వివిధ వ్యవస్థల ద్వారా కల్పిస్తారు. స్థానిక మానవ వనరులకు తగిన శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరుస్తారు. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు అవసరమైన ముడిసరుకులు శూన్య పెట్టుబడితోనే సేకరించే విధానాలపై అవగాహన కల్పించనున్నారు. తేనెటీగలు, పందెపు గుర్రాలు, మొక్కల పెంపకం, వన్య మృగాల పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయ, పట్టు, జీవ రసాయన ఎరువులు, ప్రకృతి ఔషధం, పూలు, సాంబారు పదార్థాలు, సొంఠి, పసుపు జామ్, వ్యవసాయ పర్యాటకం, ఆయుష్‌ వైద్యం, పశువుల ఆహారం, నేల సార పరీక్షలు, సుగంధ ద్రవ్యాల తయారీ వంటి 50రకాల అనుబంధ వ్యవసాయ పరిశ్రమలు ఈ డైరెక్టరేట్‌ పరిధిలోనికి వస్తాయి.


మొక్కల పెంపకానికీ సర్కారు వెన్నుదన్ను 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని