logo

Crime News: సినిమాలుచూసి బ్యాంకులో దొంగతనం..మెకానికల్‌ ఇంజినీరు అరెస్టు

సినిమాలు, వీడియోలు చూసి బ్యాంకులో ఎలా దొంగతనం చేయాలో తెలుసుకుని ఆచరణలో పెట్టిన ధీరజ్‌ (25)ను బెంగళూరులోని మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన నిందితుడు ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా చేరాడు. గత వారం భారతీయ

Updated : 23 Jan 2022 08:13 IST


ధీరజ్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: సినిమాలు, వీడియోలు చూసి బ్యాంకులో ఎలా దొంగతనం చేయాలో తెలుసుకుని ఆచరణలో పెట్టిన ధీరజ్‌ (25)ను బెంగళూరులోని మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన నిందితుడు ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా చేరాడు. గత వారం భారతీయ స్టేట్‌ బ్యాంకు శాఖ మూసి వేసే సమయానికి ముందు నిందితుడు లోనికి ప్రవేశించాడు. కత్తి చూపించి ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను బెదిరించాడు. లాకర్‌ను తెరిపించి అందులో ఉన్న రూ.85 లక్షల నగదు, ఆభరణాలను సంచిలో నింపుకొని పరారయ్యాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. లోన్‌ యాప్‌లలో రుణాలు తీసుకుని, అమెరికాలోకి కొన్ని సంస్థలతో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ నిర్వహించిన ధీరజ్‌ సుమారు రూ.35 లక్షల రుణం తీసుకున్నాడు. తన విలాసాలకు మరో రూ.5 లక్షలు ఖర్చు చేశాడు. రుణభారం పెరిగిపోవడంతో ఒక్కడే బ్యాంకులో ఎలా దొంగతనం చేయాలో వీడియోలు చూసి, తన పథకాన్ని అమలు చేసి, చివరకు దొరికిపోయాడని ఆగ్నేయ విభాగం డీసీపీ శ్రీనాథ్‌ మహదేవ్‌ జోషి తెలిపారు. దొంగతనం చేసిన తర్వాత బస్సులో చిక్కమగళూరు, బళ్లారి, శివమొగ్గ, అనంతపురం తదితర ప్రాంతాల్లో సంచరించాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసు బృందాన్ని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని