logo

ఘన కల్యాణానికి సినీ ఫక్కీలో దోపిడీ

ఘనంగా పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఓ దుండగుడు బ్యాంకు దోపిడీకి పాల్పడి దొరికిపోయిన ఉదంతం హుబ్బళ్లి కొప్పికర్‌ రోడ్డులోని భారతీయ స్టేట్‌బ్యాంకు శాఖలో వెలుగు చూసింది. ఆలస్యంగా అందిన వివరాల ప్రకారం... ఈ నెల 18న విజయపుర ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తి భారతీయ

Published : 23 Jan 2022 00:37 IST


దుండగుడు (కుడి నుంచి రెండో వ్యక్తి), స్వాధీనం చేసుకున్న నగదుతో పోలీసులు

హుబ్బళ్లి, న్యూస్‌టుడే: ఘనంగా పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఓ దుండగుడు బ్యాంకు దోపిడీకి పాల్పడి దొరికిపోయిన ఉదంతం హుబ్బళ్లి కొప్పికర్‌ రోడ్డులోని భారతీయ స్టేట్‌బ్యాంకు శాఖలో వెలుగు చూసింది. ఆలస్యంగా అందిన వివరాల ప్రకారం... ఈ నెల 18న విజయపుర ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తి భారతీయ స్టేట్‌బ్యాంకు శాఖలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించి రూ. 6.39 లక్షల నగదు తీసుకుని పరారవుతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనరు లాభురామ్‌ తెలిపారు. నిందితుడికి మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉందని దర్యాప్తులో వెల్లడైంది. వివాహాన్ని అట్టహాసంగా జరుపుకొనేందుకు అవసరమైన నగదు కోసమే బ్యాంకు దోపిడీకి పాల్పడినట్లు తెలిసిందన్నారు. నిందితుడు లోనికి ప్రవేశించడం, బ్యాంకు పిబ్బందిని బెదిరించి నగదుతో వెళ్లడం... ఈ దృశ్యాలన్నీ బ్యాంకులోని నిఘా కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడిని బంధించిన పోలీసులను నగర పోలీసు కమిషనరు అభినందించారు. బ్యాంకు దోపిడీ సినిమా ఫక్కీలో సాగింది. 18న సాయంత్రం ఐదు గంటల సమయంలో తనను గుర్తించకుండా ఆగంతకుడు మంకీ క్యాప్‌ ధరించి బ్యాంకులోకి ప్రవేశించాడు. చేతిలో పదునైన చాకుతో లోనికి ప్రవేశించిన వెంటనే సిబ్బందిని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకుంటే నిర్దాక్షిణ్యంగా పొడిచేస్తానంటూ గట్టిగా హెచ్చరించాడు. దుండగుడి హెచ్చరికలకు భయపడి బ్యాంకు సిబ్బంది నగదును అందించారు. అంతే..! ఆ డబ్బు లాక్కుని పరారయ్యాడు. అదే సమయంలో తేరుకున్న బ్యాంకు సిబ్బంది పెద్దపెట్టున కేకలు వేయడంతో స్థానికులు దుండగుడిని బంధించి పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు