logo

హస్తినలో చందన మేనా!

గణతంత్ర దినోత్సవాలకు కర్ణాటక నుంచి పంపించిన శకటాన్ని హస్తినలోని రాజ్‌పథ్‌ వీధిలో ముందస్తుగా ఆదివారం నడిపించారు. హస్తకళా ఉత్పత్తులు, బొమ్మలు ఉన్న శకటాన్ని ఈసారి ఎంపిక చేశామని సమాచార శాఖ కమిషనర్‌ డాక్టర్‌ పి.ఎస్‌.హర్ష వెల్లడించారు. ఈ ఏడాది కర్ణాటక శకటం ప్ర

Published : 25 Jan 2022 04:37 IST

 


కర్ణాటక శకటం వద్ద సమాచార శాఖ అధికారులు, యక్షగాన కళాకారులు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : గణతంత్ర దినోత్సవాలకు కర్ణాటక నుంచి పంపించిన శకటాన్ని హస్తినలోని రాజ్‌పథ్‌ వీధిలో ముందస్తుగా ఆదివారం నడిపించారు. హస్తకళా ఉత్పత్తులు, బొమ్మలు ఉన్న శకటాన్ని ఈసారి ఎంపిక చేశామని సమాచార శాఖ కమిషనర్‌ డాక్టర్‌ పి.ఎస్‌.హర్ష వెల్లడించారు. ఈ ఏడాది కర్ణాటక శకటం ప్రత్యేక బహుమతి దక్కించుకుంటుందని సమాచార శాఖ అధికారులు, శకటం రూపకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రదర్శనకు 12 రాష్ట్రాల స్తబ్ద చిత్రాలు ఎంపిక చేయగా వాటిలో ఒకటిగా, దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక స్తబ్ద చిత్రం కర్ణాటకదే కావడం గమనార్హం. వరుసగా 13వ ఏడాది కర్ణాటక స్తబ్దచిత్రం రాజ్‌పథ్‌ వీధిలో గణతంత్ర దినోత్సవం రోజు ప్రదర్శిస్తున్నామని చెప్పారు. కౌశల్యంతో తయారు చేసిన కుండ, శ్రీగంధంతో చేసిన చిన్న వస్తువులు, చేతిమగ్గంపై నేసిన చీరలు, చేతితో తయారు చేసిన ఒక ప్రత్యేక కళాకృతితో కలిపి 16 హస్తకళా వస్తువులు, జియో ట్యాగ్‌ సంకేతపు జాబితాలో ఉన్నవాటిని ఈ శకటంపై ఉంచామన్నారు. మైసూరు కలప, దంతం ముక్కలతో అలంకరించిన ఏనుగు బొమ్మ శకటం ముందు భాగంలో తీర్చిదిద్దారు. యక్షగాన కళాకారిణి బొమ్మ, గంజీఫా కళాకృతులను వెనుక అమర్చారు. తీరప్రాంత జిల్లాల ప్రత్యేకతను ప్రదర్శించే భూతారాధన మాస్కు ధరించిన లోహపు కళాకృతులు, బిదరి కళాకృతి.. నెమలిబొమ్మ ఈ శకటంపై ప్రత్యేకాకర్షణగా పేర్కొనవచ్ఛు

● చెన్నపట్టణ, కిన్నాళె కలప బొమ్మలు (ఇన్‌లే కార్వింగ్‌), కంచు ప్రతిమలు, వెదురు కళాకృతులు, టెర్రకోట, వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీగంధపు బొమ్మలు, దంతాలపై చెక్కిన చిత్తరువులు, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అధికారులు వివరించారు. స్వాతంత్య్ర పోరాట యోధురాలు కమలాదేవి చటోపాధ్యాయ ఉపయోగించిన గంధం పెట్టె, నెమలి ఆకారంలోని దీపపు సిమ్మెలు, సండూరులో అరటి నారతో చేసిన గోనెసంచులు, ఇళకల్‌, మొళకాల్మూరు, మైసూరు చీరలు, పశ్చిమ కనుమల్లో లభించే బెత్తం, వెదురు, అడవి తీగలు, తాటి ఆకులతో చేసిన బుట్టలు హస్తిన ప్రదర్శనకు సమకూర్చామన్నారు. ప్రముఖ కళా దర్శకుడు శశిధర్‌ అడపకు చెందిన ప్రతిరూపి సంస్థకు చెందిన వంద మందికి పైగా కళాకారులు ఈ శకటం రూపకల్పనలో శ్రమించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రవీణ్‌ దయానంద రావు, ఆయన నేతృత్వంలోని కళాకారులు, జానపద కళాకారుడు డాక్టర్‌ రాధాకృష్ణ ఉరాళ నేతృత్వంలోని కళాకారులు ఈ శకటంతో ప్రదర్శనలో పాల్గొంటారు.

రాజ్‌పథ్‌లో కర్ణాటక స్తబ్ద చిత్రం నమూనా ప్రదర్శన సంభ్రమం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని