logo

విస్తరణతంత్ర రాజకీయం

మంత్రివర్గ విస్తరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆశావహులు పట్టుడుతున్నారు. రాష్ట్రంలోని తమకు ఆప్తులైన కాషాయదళ నాయకులతో రహస్య సమావేశాలు కొనసాగిస్తున్నారు. మెరుగైన పనితీరు చూపించని కొందరు అమాత్యులకు పార్టీ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు తెరవెనుక మొదలయ్యాయి. గతంలోనే.. సం

Published : 25 Jan 2022 04:37 IST

శ్రమైక వేదిక : బసవేశ్వరుడి మహా నిర్మాణం బీదర్‌ జిల్లా బసవకల్యాణలోని ‘అనుభవ మండపం’

విస్తరణ, ఆధునికీకరణ కార్యక్రమాలపై సోమవారం బెంగళూరులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : మంత్రివర్గ విస్తరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆశావహులు పట్టుడుతున్నారు. రాష్ట్రంలోని తమకు ఆప్తులైన కాషాయదళ నాయకులతో రహస్య సమావేశాలు కొనసాగిస్తున్నారు. మెరుగైన పనితీరు చూపించని కొందరు అమాత్యులకు పార్టీ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు తెరవెనుక మొదలయ్యాయి. గతంలోనే.. సంక్రాంతి నాటికి మంత్రివర్గ విస్తరణ, కొందరికి శాఖల మార్పు, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కమలనాథులు ప్రణాళిక రూపొందించుకున్నారు. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరిగింది. ఆ క్రమంలో కాంగ్రెస్‌, జనతాదళ్‌ను వీడి భాజపా టిక్కెట్టుపై గెలుపొంది, అమాత్యులుగా సేవలు అందిస్తున్న నాయకుల్లో గుబులు మొదలైంది. పార్టీ కోసం జెండా కర్రలు మోసిన తమను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వారికి మంత్రిగా బాధ్యతలు అప్పగించారని మాజీ మంత్రులు రేణుకాచార్య, బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ నేరుగానే తమ నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు పూర్తయిన తర్వాతే విస్తరణ చేపట్టాలని హస్తినలో పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. అప్పటి వరకు ఆగడం సాధ్యం కాదని, ఇప్పుడే విస్తరణ చేపట్టాలనే వారి గళం జోరందుకుంది. ఇప్పుడు కొందరికి పదవీ గండం కలిగితే, తేనెతుట్టెను కెలికినట్లు అవుతుందని భాజపా జాతీయ నాయకత్వం యోచిస్తోంది. తమ పదవులకు ఎటువంటి గండం ఉండదని కొందరు నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొత్త వారికి అవకాశం కల్పించేందుకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో కర్ణాటకలో వరుసగా మూడు రోజులు సభలను నిర్వహిద్దామనుకున్న ప్రణాళిక కొవిడ్‌ నిబంధనలతో రద్దయింది. కొవిడ్‌ నిర్వహణ, జిల్లా వ్యవహారాల బాధ్యతలను అప్పగించడంలో అశోక్‌, మాధుస్వామిలకు మొండి చేయి చూపించారు. వారిద్దరికీ ఏ జిల్లా బాధ్యతలనూ అప్పగించలేదు. బెంగళూరు నగర జిల్లాపై పట్టు సాధించేందుకు అశోక్‌, సోమణ్ణ మధ్య మొదటి నుంచి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. వారిద్దరికీ ఉద్యాననగరి బాధ్యతలు అప్పగించకుండా ముఖ్యమంత్రే స్వయంగా నగర బాధ్యతలను తన వద్ద ఉంచుకున్నారు.

ఇప్పుడప్పుడే కాదు..

మంత్రివర్గ విస్తరణకు తనపై ఒత్తిడి పెరుగుతున్నా.. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రశాంతంగా ఉన్నారు. విస్తరణకు సంబంధించి కేంద్ర నాయకులు ఇప్పటి వరకు పచ్చ జెండా ఊపలేదు. అది జాప్యమయ్యే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడించారు. మంత్రిగా అవకాశం కల్పించాలని తనను, జాతీయ నాయకులను కోరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. విస్తరణకు సంబంధించిన చర్చలు ఈ వారంలో ఉంటాయని భావించినా, ఇప్పటి వరకు కేంద్ర నాయకుల నుంచి తనకు పిలుపు రాలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్‌, మండళ్లకు అధ్యక్షుల నియామకం, పాలికె ఎన్నికల ప్రక్రియ తదితర అంశాలను చర్చించేందుకు మంగళవారం నుంచి గురువారం వరకు పార్టీ ప్రధాన కార్యాలయం ‘జగన్నాథ భవన్‌’లో భాజపా రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ నేతృత్వంలో నాయకులు సమావేశమవుతారని సీఎం తెలిపారు. పార్టీలో నాయకుల మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 28కి ఆరు నెలలు పూర్తవుతాయని, ఈమధ్య సాధనకు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేసి, ఆ రోజు విలేకరులతో మాట్లాడతానని చెప్పారు. ఆలోగా బడ్జెట్‌ రూపకల్పనకు చర్యలు తీసుకుంటానని సీఎం పేర్కొన్నారు.

బొమ్మై మంత్రివర్గంలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉండగా, మరి కొందరిని మంత్రి స్థానం నుంచి తప్పించి, కనీసం 10 మందికి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని భాజపా జాతీయ నాయకత్వం కోరుకుంటోంది. తమ మధ్య వైరాన్ని పక్కనపెట్టి రేణుకాచార్య, బసవనగౌడ పాటిల్‌ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బెళగావి విభాగంలో జార్ఖిహొళి సోదరులు, మంత్రి ఉమేశ్‌ కత్తితో అక్కడి భాజపా ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలను నిర్వహించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విస్తరణ జోలికి వెళ్లే అవకాశం తక్కువ అని రాజకీయ విశ్లేషకుల మదింపు.

నాకు అర్హతలేదా?

రేణుకాచార్య

దావణగెరె, న్యూస్‌టుడే : మంత్రివర్గంలో చేరేందుకు తమకు అర్హత లేదా అని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎం.పి.రేణుకాచార్య సూటిగా ప్రశ్నించారు. మంత్రివర్గంలో స్థానం కోసం అవసరమైతే కేంద్ర నాయకత్వాన్ని కలుసుకునేందుకు దిల్లీ వెళ్తానని చెప్పారు. ఆయన సోమవారం హొన్నాళిలో విలేకరులతో మాట్లాడారు. ఎప్పుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా కొందరికే తప్పనిసరిగా అవకాశాలిస్తుంటారని విమర్శించారు. గతంలో ఎక్సైజ్‌ మంత్రిగా తాను మంచి ఫలితాన్ని సాధించినట్లు చెప్పారు. అప్పటి వరకు ఓ కార్యాలయానికే పరిమితమైన శాఖను ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా గుర్తింపు పొందేలా చేశానని గుర్తు చేశారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి భాజపా ప్రభుత్వం ఏర్పడేందుకు తాను, బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ ఎంత తీవ్రంగా ప్రయత్నించామో తెలుసన్నారు. అయినా తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండు చేశారు. విస్తరణకు ఎప్పుడో మార్చిలో ముహూర్తాన్ని నిర్ణయించడానికి బదులు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

అది.. ఉత్తుత్తి సమావేశం


బాలచంద్ర జార్ఖిహొళి

బెళగావి, న్యూస్‌టుడే : బెళగావి జిల్లాలో కొందరు నాయకులు రహస్య మంతనాలు జరిపినట్లుగా వస్తున్న వార్తలను పెద్దగా పట్టించుకోరాదని బాలచంద్ర జార్ఖిహొళి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గోకాక్‌లో ఈ విషయమై స్పందిస్తూ ఎవరెవరో మంతనాలు జరిపినంత మాత్రాన అన్నింటినీ పట్టించుకుంటే ఎలాగని ప్రశ్నించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎవరెవరు శ్రమిస్తున్నారో నాయకత్వానికి బాగా తెలుసన్నారు. 2008 నుంచి పార్టీ పటిష్టతకు శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మంత్రి ఉమేశ్‌ కత్తి నేతృత్వంలో జిల్లా నాయకుల సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి జార్ఖిహొళి సోదరులను దూరంగా ఉంచడం జిల్లాలో అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలచంద్ర జార్ఖిహొళి స్పందించినట్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని