logo

మువ్వన్నెల రెపరెపలు..

దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు అవకాశం కల్పించిన గణతంత్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరుపుకొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయి నాయకుడి నుంచి సామాన్యుల వరకు ఎవరికివారు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆయా జిల్లాలకు ఇటీవలే బాధ్య

Published : 27 Jan 2022 00:39 IST


శ్రీరంగపట్టణ : వేడుకల్లో వేద పండితుడు భాను ప్రకాశ్‌శర్మ తదితరులు

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు అవకాశం కల్పించిన గణతంత్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరుపుకొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయి నాయకుడి నుంచి సామాన్యుల వరకు ఎవరికివారు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆయా జిల్లాలకు ఇటీవలే బాధ్య మంత్రులను నియమించడంతో వారంతా సంబంధిత జిల్లాల్లో తొలిసారి గణతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. కరోనా కారణంగా విద్యార్థులను ఉత్సవాలకు దూరంగా ఉంచారు. అన్ని ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకున్న తరువాతనే అక్కడక్కడ కొద్దిమందిని మాత్రమే అనుమతించారు. సాధారణంగా గణతంత్ర వేడుకల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొనేవారు. కరోనా కారణంగా ప్రజలకు అనుమతిని నిరాకరించారు. అయినప్పటికీ.. సంప్రదాయం ప్రకారం జిల్లా బాధ్య మంత్రులు గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ స్టేడియం చుట్టూ వాహనాల్లో సంచరించారు. 
* కలబురగి జిల్లా జేవర్గిలో రవి సింగ్‌ అనే చిరు హోటల్‌ నిర్వాహకుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం తన హోటల్‌లో మువ్వన్నెల దోసెల్ని వినియోగదారులకు అందించడం ద్వారా తన దేశభక్తిని చాటుకున్నారు. 
* సెంచురీ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ మైసూరులోని శక్తిధామలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొన్నారు. అక్కడ ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆశ్రమవాసులకు మిఠాయిల్ని పంచిపెట్టారు. వారిలో మరింత ఉత్సాహం కల్గించేందుకు అందరినీ బస్సులోకి ఆహ్వానించి.. స్వయంగా బస్సును నడిపి సంతోషం కల్గించారు. 
* మండ్యలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గోపాలయ్య మాట్లాడుతూ రైతులకు అధిక ప్రయోజనాల్ని కల్గించే రెండు చక్కెర కర్మాగారాల్ని గానుగ ఆడేలా తగిన  చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. మైషుగర్స్‌ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక లోక్‌సభ సభ్యురాలైన నటి సుమలత పాల్గొన్నారు. రేవు నగరి మంగళూరులో ఏర్పాటైన కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కృతుడు ఆమై మహాలింగప్పను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సునిల్‌కుమార్‌ ఘనంగా సన్మానించారు.  


ధార్వాడ : జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ఆచార్‌ హాలప్ప 


శివమొగ్గ : వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణగౌడ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని