logo

మురిసిన కృషివిజ్ఞాన కేంద్రం!

కేంద్ర సర్కారు మంగళవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో బెంగళూరులోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ అనుబంధ గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే) పూర్వ విద్యార్థులే కావడంతో ఆ ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వీరిలో ఒకరు పద్మభూషణ్‌ గ్రహీత

Published : 27 Jan 2022 00:39 IST


బెంగళూరులోని గాంధీ కృషి విజ్ఞానకేంద్రం ఆవరణ

ఈనాడు డిజిటల్, బెంగళూరు : కేంద్ర సర్కారు మంగళవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో బెంగళూరులోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ అనుబంధ గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే) పూర్వ విద్యార్థులే కావడంతో ఆ ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వీరిలో ఒకరు పద్మభూషణ్‌ గ్రహీత డాక్టర్‌ కృష్ణ ఎల్ల.. మరొకరు పద్మశ్రీ గ్రహీత ఆచార్య సుబ్బణ్ణ అయ్యప్పన్‌. సుబ్బణ్ణ అయ్యప్పన్‌ ఫిషరీస్‌లో బీఎస్‌సీ, ఎమ్మెస్సీ చేశారు. డాక్టర్‌ కృష్ణ ఎల్ల ఎమ్మెస్సీ (అగ్రికల్చర్‌) విద్య ఇదే ఆవరణలో పూర్తి చేశారు. ఒకే ఏడాది ఇద్దరు పూర్వ విద్యార్థులు భారతీయ అత్యున్నత పౌరపురస్కారాలు దక్కించుకోవటంపై బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ బయోటెక్‌ అధినేతగా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన డాక్టర్‌ కృష్ణ ఎల్ల, కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి సుబ్బణ్ణ అయ్యప్పన్‌ వ్యాపార, వ్యవసాయ పరిశోధనల్లో భావితరానికి మార్గదర్శకులని ఆ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

విశ్వవిద్యాలయానికే గర్వకారణం
డాక్టర్‌ కృష్ణ ఎల్ల, ఆచార్య అయ్యప్పన్‌ వారివారి రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. డాక్టర్‌ కృష్ణ ఎల్ల ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించే టీకా తయారు చేసి భారతీయ పరిశోధన సామర్థ్యాన్ని జగతికి చాటారు. పూర్వ విద్యార్థిగా ఆయన జీకేవీకే విద్యార్థులకు ఇచ్చే సందేశాలు నిత్యం స్ఫూర్తి నింపుతుంటాయి. ఆచార్య అయ్యప్పన్‌ చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చేపట్టిన పరిశోధనలు భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల స్థాయిని పెంచాయి. వీరిని పద్మపురస్కారాలతో సత్కరించటం మా విశ్వవిద్యాలయానికి గర్వకారణం. వీరిద్దరి సాధనలు వ్యవసాయ విద్యపై యువత ఆసక్తిని మరింత పెంచుతాయి. త్వరలో విశ్వవిద్యాలయం తరపున వీరిద్దనీ ఘనంగా సత్కరిస్తాం. -డాక్టర్‌ రాజేంద్రప్రసాద్, ఉపకులపతి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని