logo

అన్నీ ఒమిక్రాన్‌ వేరియంట్లే

కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య మరికొంత పెరిగింది. ఫిబ్రవరి రెండో వారం వరకు కేసుల తీవ్రత ఇలాగే ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. నమోదవుతున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్లేనని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో తేటతెల్లమవుతోంది. కొవిడ్‌ నియంత్రణలో

Published : 27 Jan 2022 00:39 IST


 బళ్లారిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సిబ్బంది  కరోనా నియంత్రణ చర్యలు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య మరికొంత పెరిగింది. ఫిబ్రవరి రెండో వారం వరకు కేసుల తీవ్రత ఇలాగే ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. నమోదవుతున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్లేనని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో తేటతెల్లమవుతోంది. కొవిడ్‌ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని గణతంత్ర వేడుకల ప్రసంగంలో గవర్నర్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. మరో నాలుగు వారాల్లో కరోనాతో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనాతో మరణించిన వారి గణాంకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాచిపెట్టి తప్పుడు గణాంకాలను విడుదల చేశాయని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ఆరోపించారు. కర్ణాటకలో నాలుగు లక్షల మంది కరోనాతో మరణించారని, వారందరికీ పరిహారాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
తాజా కేసులివీ..
కర్ణాటకలో తాజాగా 48,905 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 41,699 మంది పూర్తిగా కోలుకున్నారు. చికిత్స పొందుతూ 39 మంది మరణించారు. క్రియాశీలక కేసుల సంఖ్య 3,57,909కు చేరుకున్నాయి. పాజిటివిటీ 22.51 శాతం, మరణాలు 0.07 శాతంగా నమోదయ్యాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన 143 మందితో కలిపి 627 మంది ప్రయాణికులకు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్‌పోస్టుల వద్ద 2.17 లక్షల మందికి స్వాబ్‌ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 1.93 లక్షల మంది టీకా వేయించుకున్నారు. 


గౌరవ్‌గుప్తా 

పాలికె ముఖ్యాధికారికి పాజిటివ్‌
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ముఖ్య కమిషనర్‌ గౌరవ్‌గుప్తాకు బుధవారం కరోనా సోకింది. వైద్యుల సూచనతో ఆయన హోం ఐసోలేషన్‌లో విశ్రాంతికి కదిలారు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల కిందట మాణిక్‌షా సైనిక స్మారక మైదానంలో పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్, జిల్లాధికారి మంజునాథ్, సంయుక్త కమిషనర్‌ రవికాంతేగౌడ తదితరులతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరైన అధికారులు, పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని