yediyurappa: ఒంటరితనమే వేదనకు కారణమా?
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఆమె ఓ పెద్దింటి అమ్మాయి. సమాజాన్ని చక్కగా చదివే వైద్యురాలి వృత్తిలో నిమగ్నమైన యువతరం ప్రతినిధి. ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలనం.. దిగ్భ్రాంతికి కారణం. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనుమరాలు డాక్టర్ సౌందర్య (30) హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడడం ఆమె కుటుంబ సభ్యులను కలచి వేసింది. శుక్రవారం నాటి ఈ ఘటనకు కారణాలు విశ్లేషించే పనిలో అటు మీడియా- ఇటు పోలీసు వ్యవస్థ మునిగిపోయాయి. మూడేళ్ల కిందటే ఆమె డాక్టర్ నీరజ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒకరే సంతానం. కాన్పునకు మునుపు వరకు ఆమె రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు అందించారు. తొమ్మిది నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నారు. కొవిడ్ పరిస్థితుల సమయంలో ఇంట్లో ఎక్కువ సమయం ఒంటరిగా గడపడంతోనే ఆమె మానసిక ఒత్తిడికి గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె బలవన్మరణానికి పాల్పడడాన్ని యడియూరప్ప జీర్ణించుకోలేక పోయారు. ఆయనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఫోన్ చేసి ఊరడించారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ్ తదితరులు ధైర్యం చెప్పిన వారిలో ఉన్నారు. కుమార్తె పద్మావతి.. ఆమె గారాలపట్టి సౌందర్య అంటే అప్పకు చాలా ఇష్టం. మేనమామలు బి.వై.విజయేంద్ర, బి.వై.రాఘవేంద్రలకు ఇష్టమైన మేనకోడలు. ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప మనువరాలిని అని ఆమె ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకొనేవారు కాదు. అలా చెబితే.. అందరూ తనకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి, దూరంగా ఉంచుతారని ఆమె అనుకునేవారు. కొవిడ్ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండడమే ఆమెను బాధించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు కూడా ఏమీ లేవని సౌందర్య తల్లి పద్మావతి తెలిపారు. అందరితో కలివిడిగా మాట్లాడే ఆమె బలవన్మరణానికి పాల్పడడంతో వేదనకు లోనయ్యారు.
ఇలా.. ఇంకెందరు?
గతంలో ఐఏఎస్ అధికారి డి.కె.రవి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలోనూ దర్యాప్తు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. ఆర్థిక లావాదేవీలు, ఇతర ఒత్తిళ్లతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానం ఉంది. భారతీయ విజ్ఞాన సంస్థలో రెండేళ్లలో ఏడుగురు ఉన్నత విద్యావంతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. భవిష్యత్తు జీవితంపై అవసరమైన ఆందోళనతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణల్లో తేటతెల్లమైంది. కొవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయిన లక్షలాది మందిలో ధైర్యాన్ని నింపేందుకు నిమ్హాన్స్ ప్రత్యేక సహాయ వాణిని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాతిక లక్షల మందికి కౌన్సెలింగ్ చేసి, వారిలో ధైర్యాన్ని నింపింది. ఇళ్లలో ఒంటరిగా ఉంటున్న వారిని గమనిస్తూ, వారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు రోటరీ సంస్థ, మెడికో ప్యాస్టోరాల్ అసోసియేషన్, స్నేహ ఫౌండేషన్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియల్ సైన్సెస్ ప్రత్యేక సహాయ వాణి నంబర్లు నిర్వహిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.