logo

అవినీతి సుడిగుండం

రాష్ట్ర ప్రభుత్వాన్ని ‘40 శాతం కమీషన్‌’ ఆరోపణలు మరోసారి చుట్టుముట్టాయి. నవంబరులో కర్ణాటక గుత్తేదారుల సంఘం వివిధ అభివృద్ధి పనులకు సమర్పించాల్సిన కమీషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి కలకలం సృష్టించింది. తాజాగా.. ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్న భాజపా కార్యకర్త, గుత్తేదారు సంతోశ్‌ పాటిల్‌ ఉ

Updated : 13 Apr 2022 06:24 IST

●సర్కారుపై కమీషన్‌ పిడుగు●

గుత్తేదారు ఆత్మహత్యపై ఆరా

అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్ప తక్షణమే పదవికి రాజీనామా

చేయాలని డిమాండు చేస్తూ బెంగళూరులో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసన ప్రదర్శన

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వాన్ని ‘40 శాతం కమీషన్‌’ ఆరోపణలు మరోసారి చుట్టుముట్టాయి. నవంబరులో కర్ణాటక గుత్తేదారుల సంఘం వివిధ అభివృద్ధి పనులకు సమర్పించాల్సిన కమీషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి కలకలం సృష్టించింది. తాజాగా.. ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్న భాజపా కార్యకర్త, గుత్తేదారు సంతోశ్‌ పాటిల్‌ ఉదంతం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపడేసింది. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు విచారణలో తేలాల్సి ఉన్నా.. ఓ మంత్రి నేరుగా ఈ సంఘటనకు కేంద్రంగా మారటం సర్కారుకు సంకట స్థితిని తెచ్చిపెట్టింది. ఓ వైపు సామాజిక వివాదాలతో తలపట్టుకున్న ప్రభుత్వం ‘కమీషన్‌’ వ్యవహారంతో రక్షణాత్మక వలయంలో చిక్కుకుంది.

డిసెంబరులో బెళగావి సువర్ణసౌధలో నిర్వహించిన సమావేశాల్లోనే ఈ వ్యవహారాలపై చర్చ మొదలైంది. అప్పటికే రాష్ట్ర గుత్తేదారుల సంఘం ప్రధానికి చేసిన ఫిర్యాదు పత్రం మంత్రివర్గాన్ని కుదుపేసింది. రహదారులు, భవనాలు, నీటిపారుదల, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌, బీబీఎంపీ, ఆరోగ్య- తదితర శాఖల్లో అవినీతి రాజ్యమేలుతున్నట్లు ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. టెండర్‌కు ముందు ఐదు శాతం, పనులు మొదలు పెట్టే సమయానికి మరో 5 శాతం, బిల్లుల కోసం 30 శాతం సొమ్మును అధికారులు, ప్రజా ప్రతినిధులు రాబడుతున్నట్లు రాష్ట్ర గుత్తేదారుల సంఘం ఆరోపించింది. ఇదే అంశంపై విధానసభ సమావేశాల్లో చర్చించాలని విపక్షం పట్టుబట్టింది. అప్పటికే బిట్‌ కాయిన్‌ అంశం కూడా చర్చకు రావటంతో కమీషన్‌ వ్యవహారం మరుగునపడింది.

‘విధాన’ సమావేశాల్లోనూ

ఇటీవల ముగిసిన బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అక్రమాల వ్యవహారం చర్చకు వచ్చింది. ఈసారి విపక్షాలు కాకుండా నేరుగా అధికార పక్ష సభ్యులే ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల టెండర్లు దక్కించుకుంటున్న వారు పొరుగు రాష్ట్రాలవారేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యుడు ఎం.బి.పాటిల్‌ ఆ కాంట్రాక్టర్ల పేర్లు బహిరంగపరిచారు. ఆ సందర్భంగా జలవనరుల మంత్రి గోవింద కారజోళ వివరణ ఇచ్చినా విపక్షాలు సంతృప్తి చెందలేదు. రాష్ట్ర గుత్తేదారులు అడిగినంత కమీషన్‌ ఇవ్వని కారణంగా పొరుగు రాష్ట్రాల వారికి టెండర్లు దక్కేలా చేస్తారన్న ఆరోపణను సర్కారు ఎదుర్కొంది. టెండర్‌ లేకుండా పనులకు అనుమతి ఇవ్వటం వల్ల రాష్ట్రంలో గుర్తింపు పొందిన గుత్తేదారులకు పనులు దక్కే అవకాశం చేజారి పోతున్నట్లు వారి సంఘం చేసిన ఆరోపణ చర్చకు వచ్చింది. చేసిన పనికి నాలుగురెట్లు అధిక బిల్లులు మంజూరు చేయటంపై జేడీఎస్‌ సభ్యుడు శివలింగేగౌడ, కాంగ్రెస్‌ నేత కృష్ణభైరేగౌడ ఆక్రోశం వ్యక్తం చేశారు. గడచిన విధానసభ సమావేశాల్లో ‘కమీషన్‌’ వ్యవహారంపై ముఖ్యమంత్రి నుంచి సమాధానం దక్కకపోవటంతో రాజకీయ వర్గాల్లోనూ ప్రభుత్వ పనితీరుపై ఆక్షేపణ వ్యక్తం అవుతోంది.

సర్కారు.. కర్తవ్యం

తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి బొమ్మై, హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘటన వివరాలను అధిష్ఠానం సేకరించింది. ఈశ్వరప్ప రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఈశ్వరప్పపై కేసు నమోదు చేయాలని ఆందోళన ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ఈ సంఘటనను ప్రచారాస్త్రంగా మలచుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప బెళగావిలో మంగళవారం సమావేశమయ్యారు. 2016లో డీవైఎస్‌పీ గణపతి ఆత్మహత్య కేసులో నైతిక బాధ్యతగా అప్పటి హోం మంత్రి కె.జె.జార్జ్‌ రాజీనామా చేశారు. ఆ సంఘటనలో గణపతి స్వయంగా రాసిన డెత్‌నోట్‌ బలమైన సాక్ష్యంగా నిలిచింది. తాజా సంఘటనలో ఓ డిజిటల్‌ మాధ్యమంలో వైరల్‌ అయిన సందేశాన్ని ఆసరాగా చేసుకుని రాజీనామా లేదా కేసు నమోదు చేసేందుకు సర్కారు సిద్ధంగా లేదు. ఆరోపణ చేయగానే అపరాధం చేసినట్లు కాదని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యాఖ్యానించారు. సతీశ్‌తో పాటు ముగ్గురు స్నేహితులు కలిసి హోటల్‌కు వెళ్లిన క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇప్పుడూ ఈశ్వరప్పే

అభివృద్ధి పనుల వ్యవహారం వచ్చిన ప్రతిసారీ మంత్రి ఈశ్వరప్ప కేంద్రంగా మారుతున్నారు. 2021 ఏప్రిల్‌లో తన శాఖ కార్యకలాపాల్లో సీఎం జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపిస్తూ అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్పపై ఈశ్వరప్ప గవర్నర్‌కు లేఖ రాశారు. ఓ కేబినెట్‌ మంత్రి శాఖల్లో ముఖ్యమంత్రి జోక్యం చట్ట విరుద్ధమని ఆయన నాడు ప్రస్తావించారు. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర గ్రామ పంచాయతీ టెండర్లల్లో పెత్తనం చెలాయిస్తున్నారన్నది ఈ లేఖ ద్వారా ఈశ్వరప్ప చేసిన ప్రధాన ఆరోపణ. ఆయనే ప్రస్తుతం 40 శాతం కమీషన్‌ సుడిగుండంలో ఇరుక్కున్నారు. ఉడుపిలో మంగళవారం చనిపోయిన మృతుడు సంతోశ్‌ పాటిల్‌.. ముందే వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆయన 80 సార్లు ఈశ్వరప్పను కలిసినట్లు సమాచారం. సంతోశ్‌ భార్య కూడా తన భర్త మరణానికి ఈశ్వరప్ప కారణమని, ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపించడాన్ని మంత్రి ఖండించారు. నాకు ఆ సంతోశ్‌ పాటిల్‌ ఎవరో తెలియదని చెప్పటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని